Breaking News

వ్యాక్సినేషన్ డ్రైవ్ కు విశేష స్పందన…


-అను మై బేబీ హాస్పిటల్స్, స్మిత కేర్, ఆలయ్ ఫౌండేషన్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
-దాదాపు వెయ్యి మందికి వ్యాక్సినేషన్
-కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం
-అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. స్మిత కేర్, ఆలయ్ ఫౌండేషన్, విశాఖ మెడికవర్ హాస్పిటల్, అను మై బేబీ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా సుమారు వెయ్యి మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. 2019 చివర్లో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచదేశాలకు వ్యాప్తి చెందుతూ, రూపాంతరం చెందుతూ వస్తోందని అన్నారు. మనదేశంలో గుర్తించబడిన డెల్టా వేరియెంట్ ప్రమాదకరమైనదని, మిగతా వేరియెంట్లతో పోల్చితే డెల్టా వేరియెంట్ త్వరగా వ్యాప్తి చెందుతుందని, అత్యంత ప్రమాదకరమైనదని వివరించారు. కరోనా సెకెండ్ వేవ్ ముగుస్తున్న తరుణంలో తిరిగి కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, అత్యంత ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియెంట్ కోవిడ్-19 తీవ్రతకు కారణమని విశ్లేషించారు. కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియెంట్ ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. తొలుత ఇంగ్లండ్ లో గుర్తించబడిన డెల్టా ప్లస్ వేరియెంట్ పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలు డెల్టా వేరియెంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయించడం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్మిత కేర్, విశాఖ మెడికవర్ హాస్పిటల్, ఆలయ్ ఫౌండేషన్, అను మై బీ హాస్పిటల్ ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *