-“అహింసావాది మహాత్మాగాంధి ”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ స్మృతి దినం సందర్భంలో నాస్తికకేంద్రంలోని బాపూదర్శన్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర హరిజన సేవక్ సంఘ్ అధ్యక్షులు చెన్నుపాటి వజీర్, ఆంధ్రప్రదేశ్ గాంధీస్మారక నిధి కార్యదర్శి రశ్మి, సర్వోదయ ట్రస్టు విజయవాడ అధ్యక్షులు డా॥ జి. మోహనప్రసాద్, దా|| సమరం, డా|| పి. దీక్ష ప్రసంగించారు.
సమావేశ ప్రారంభంలో గాంధీ స్మృతిలో భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. నాస్తికకేంద్రం అధ్యక్షులు డా సమరం మాట్లాడుతూ అహింసే మార్గంగా జీవించిన గాంధీజీ గురించి మరింత విశ్లేషణాత్మక పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. రశ్ళి మాట్లాడుతూ గాంధీ- గోరాల సంభాషణలకు గల చారిత్రాత్మక ప్రాధాన్యతను వివరించారు. గాంధీజీ స్మృతి దినాన్ని ‘ ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం’గా జరుపుకుంటున్నారు అని వాసవ్య మహిళా మండలి మెడికల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డా॥ పి. దీక్ష తన ప్రసంగంలో గుర్తుచేస్తూ గాంధీజీ కుష్ఠు వ్యాధిగ్రస్తుల కొరకు ఎంతో కృషిచేశారని సేవాగ్రాం ఆశ్రమంలో పరుచూరి శాస్త్రికి స్వయంగా గాంధీజీ సేవలు చేశారని, ఆయన గాంధీజీకి సహఖైదీ మరియు సంస్కృతంలో పండితులు కూడా. సేవాగ్రాంలో ప్రత్యేకించి ఒక విభాగం కస్తూరిబా హెల్త్ సొసైటీకి అనుబంధంగా గాంధీ మొమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ కుష్టువ్యాధిగ్రస్తుల కొరకు ఎన్నో విశేషసేవలు చేస్తున్నదని తెలిపారు. వజీర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థి దశనుంచే గాంధీజీ గురించి మరింత తెలుసుకునేవిధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని విజ్ఞప్తి చేశారు. డా ॥మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ నేడు గాంధీజీ గురించి తెలియనివారు ప్రపంచంలో లేరంటే అతిశయోక్తి లేదని అదేవిధంగా మహాత్మాగాంధీ విగ్రహాలు విదేశాలలో సైతం నెలకొల్పుతున్నారంటే దానికి కారణం హింస, రక్తపాతంలేకుండా కేవలం సత్యాగ్రహం, అహింస మార్గాలలో భారత స్వాతంత్ర్యం సాధించడానికి వారుచేసిన కృషే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘గాంధీ కింగ్ ఫౌండేషన్’ ప్రతినిధి, సర్వోదయ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న డా॥ క్రాంతి, రజతగోరా మరియు వాసవ్య మహిళా మండలి కార్యకర్తలు, వివిధ అంశాలలో శిక్షణ పొందుతున్న యువతులు పాల్గొన్నారు.