-పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు
-క్షేత్ర విశిష్టతను వివరించిన అర్చకులు
-తిరుత్తణి క్షేత్ర దర్శనంతో పూర్తికానున్న షష్ట షణ్ముఖ యాత్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా శనివారం ఉదయం తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో అళగర్ కొండల్లో కొలువైన పలముదిర్చోలై అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ కళ్యాణ్ కి పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్షేత్ర విశిష్టతను ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి వివరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
తిరుత్తణి దర్శనంతో యాత్ర పూర్తి
మురుగన్ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు అయిదు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాల దర్శనం పూర్తయిందని, సాయంత్రం తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర సందర్శనతో షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని చెప్పారు.
పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు…
మురుగన్ దర్శనం అనంతరం బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఆలయ పారిశుధ్య కార్మికులను చూసి తన కాన్వాయ్ ను ఆపి వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగి ఆర్థిక సాయం అందించారు.