-కృష్ణానదికి చేరనున్న వరద నీరు…
-లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదికి భారీ వరద నీరు చేరనున్న దృష్ట్యా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందని జిల్లా కలెక్టర్ అధికారులతో చెప్పారు. శ్రీశైలం నుంచి సుమారు 5.58 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది వచ్చినట్లే విడుదల చేస్తున్నారన్నారు. అలాగే నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 256 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్ చెప్పారు. అది పూర్తిస్థాయికి చేరుకోవడానికి కనీసం 56 టీఎంసీలు కావాలన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాం ఆదివారం ఉదయానికి నిండుతుందన్నారు. ఆపై నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వదులుతారన్నారు. పులిచింతల ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉందన్నారు. జగ్గయ్యపేట నుండి ప్రకాశం బ్యారేజ్ కు ఈ వరద నీరు ఆదివారం సాయంత్రానికి చేరుకుంటుందన్నారు. ఈ దృష్ట్యా జగ్గయ్యపేట నుంచి నాగాయలంక వరకు నదీ పరీవాహక, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ నుండి నీరు విడుదల అయిన తరువాత వరద నీరు 5 వరద కాలువల నుండి నివాస ప్రాంతాల్లో చేరుకొనే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఇది గేషన్ అధికారులు వరద నీరు నిరోధించేందుకు ఆ ద్వారాలను సిమెంట్, ఇసుక బ్యాగ్ లతో మూసివేసి వచ్చే నీటిని ఎత్తివేసేందుకు 6 మోటార్లను శనివారం సాయంత్రానికే సిద్ధం చేయాలన్నారు. రాత్రి సమయంలో వరద నీరు వస్తే వృద్ధులు, పశువులు ఇబ్బంది పడే అవకాశం ఉందని అందువల్ల వచ్చే నీటి ప్రవాహం పట్ల అప్రమత్తత అవసరం అన్నారు. గేదెలు, మేకలు, గొర్రెలు, మత్స్యకారుల పడవలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నదిలో వరద నీరు ప్రమాదకరస్థాయిలో ఉంటుందని ఆ సమయంలో ఈతకు ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరించారు. గత సంవత్సరం బరంపార్కులో వరదనీరు వచ్చిందని ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. జగ్గయ్యపేట నుంచి నాగాయలంక వరకు సుమారు 15 మండలాల తహసీల్దార్లు రాత్రి వేళల్లో కూడా వరద పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. లంక గ్రామాల్లో అవసరమైన రేషన్ కూడా సిద్ధంగా ఉందని తహసీల్దార్లు కలెక్టర్ కు నివేదించారు. నదీ పరీవాహక ప్రాంత గ్రామాల్లో వరద పరిస్థితులపై టాంటాం ద్వారా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత, జలవనరుల శాఖ ఎస్ఇ మురళీకృష్ణ, ఇఇ స్వరూప్ తదితరులు హాజరయ్యారు.