-భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై సమీక్ష
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేందుకు వీలుగా నిర్వాసితుల పునరావాస పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణం, అక్కడ అవసరమైన సామాజిక వసతుల కల్పన వంటి పనులు త్వరగా పూర్తిచేసినట్లయితే నిర్వాసితులు తమ గ్రామాలను ఖాళీ చేసే అవకాశం ఉంటుందని, ఎయిర్ పోర్టు పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ, పునరావాస పనుల తాజా స్థితిపై జిల్లా అధికారులు, నిర్మాణ సంస్థ జి.ఎం.ఆర్. గ్రూపు ప్రతినిధులతో కలెక్టర్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ భూసేకరణ, పునరావాసంపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. మూడు భూసేకరణ విభాగాల ద్వారా భూసేకరణ చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు కోసం 2,641 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని, ఇందులో ఇప్పటివరకు 2,542 ఎకరాలు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ సంస్థకు కార్పొరేషన్ ద్వారా పనులు చేపట్టేందుకు వీలుగా అందజేశామని జిల్లా కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన భూమిని కూడా అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నిర్మాణ సంస్థకు మరో 89.47 ఎకరాలు ఇంకా అందజేయాల్సి ఉందన్నారు. భూసేకరణ అంశంలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందజేస్తోందని, గ్రామాలను త్వరగా ఖాళీచేయించి నట్లయితే నిర్మాణ పనులు త్వరగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని జి.ఎం.ఆర్.గ్రూపు ప్రతినిధి రామరాజు తెలిపారు. గూడెపువలస నిర్వాసిత కాలనీలో ఆగష్టు 5వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ఉద్యానశాఖ ఏ.డి. లక్ష్మి, ఆర్.డి.ఓ. భవానీశంకర్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీ, భూసేకరణ అధికారులు జయరాం, ఎస్.వెంకటేశ్వర్లు, పద్మావతి, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ టి.గోవింద్ తదితరులు పాల్గొన్నారు.