-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతానని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు.
ది క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ముఠా కార్మికులకు సోమవారం భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో 250 మంది కార్మికులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్) ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఠా కార్మికులతో సమావేశమయ్యామని అప్పట్లో వారు ఉచితంగా యూనిఫామ్ అందజేయాలని కోరడంతో ఇచ్చిన హామీ మేరకు ముఠా కార్మికులకు ఉచితంగా యూనిఫామ్ ను అందజేశామన్నారు. కార్మికుల శ్రేయస్సే తన లక్ష్యం అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధితో ముందుకు వెళ్తామని అన్నారు. సుజనా ఫౌండేషన్ సహకారంతో విద్య , వైద్యం , ఆరోగ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చే విధంగా పశ్చిమ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నుంచి ఎవరు పోటీ చేసిన పశ్చిమ అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపించే విధంగా తన పాలన ఉంటుందన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చిన ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని సుజనా తెలిపారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సుజనా చౌదరి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్,బొమ్మసాని సుబ్బారావు, పైలా సొమినాయుడు, సుబ్బారాయుడు, కోగంటి రామారావు, యేదుపాటి రామయ్య , అబ్దుల్ ఖాదర్ తిరుపతి అనూష తదితరులు పాల్గొన్నారు.