-ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని బకాయిదారులు వినియోగించుకోవాలి
-2025-26 సంవత్సర పన్ను పూర్తిగా చెల్లించి 5% రిబేట్ పొందాలి
-కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కు సంబంధించి ఇంటిపన్ను , ఖాళీస్థలము పన్నుల బకాయి ఉన్న పన్నులు చెల్లింపు కోసం పన్ను బకాయిదారులు ఏప్రియల్ 30 వ తేదీ లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని పొందాలని కమిషనరు కేతన్ గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి మరియు ఖాళీస్థలముల బకాయిలపై ఉన్న వడ్డీని 50% తగ్గిస్తూ ది.10-04-2025 తేదీన జి.ఓ.ఎం.ఎస్.నెం.66, ఎం.ఎ & యు.డి. డిపార్టుమెంటు జారీ చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ది.25-03-2025 వ తేదీన జి.ఓ.ఎం.ఎస్.నెం.46, ఎం.ఎ & యు.డి. (సి2) డిపార్టుమెంటు ద్వారా వడ్డీలో 50% రాయితీ యిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందని తెలిపారు. ఉత్తర్వులు జారీ చేసే నాటికి ఆరు (6) రోజులు మాత్రమే మిగిలియుండగా, ది.30-03-2025 మరియు ది.31-03-2025 రెండు రోజులు ఉగాది, రంజాన్ పండుగలు వచ్చియున్నందున ఎక్కువమంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేక పోయినారన్న విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. అటువంటి పన్ను బకాయి దారుల ప్రభుత్వం మేలు చేయాలనే ఉద్దేశ్యంతో 50% వడ్డీ రాయితీ సౌకర్యాన్ని ఏప్రియల్ 30 వ తేదీ వరకు పొడిగించారని తెలిపారు. 2024-25 ఆర్ధిక సంవత్సరము వరకు గల బకాయిలపై ఉన్న వడ్డీపై 50% రాయితీ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని బకాయి దారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని , ఏక మొత్తంలో సదరు బకాయిలు చెల్లించి 50 శాతం వడ్డీ రాయితీ వినియోగించుకోవాలన్నారు.
మార్చి, 2025 లో జారీ చేసిన ఆదేశాల మేరకు మార్చి 31 వ తేదీ నాటికి నగరపాలక సంస్థ పరిధిలో 6 రోజులలో 1069 మంది ఇంటిపన్ను బకాయి దారులు రూ.1,15,84,619/-లు , 93 మంది ఖాళీస్థల యజమానులు రూ.67,76,823/- చెల్లించారన్నారని తెలియ చేశారు.
ప్రస్తుత62025-26 ఆర్ధిక సంవత్సరము యొక్క మొత్తము పన్ను ఒకేసారి చెల్లించిన యెడల యిచ్చే 5% రిబేట్ ఏప్రియల్ 30 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రస్తుత సంవత్సరము మాత్రమే పన్ను చెల్లించవలసినవారు ముందస్తుగా పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ డబ్బులు ఆదా చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అధిక శాతం పన్నులు వసూలు చేసిన కార్పొరేషన్ లలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రెండవ స్థానం సాధించినందులకు గృహ , స్థల యజమానులకు, ఆర్ ఎమ్ సి అధికారులను, సిబ్బందిని సచివాలయ పరిపాలనా కార్యదర్శులు, మౌలిక సదుపాయాల కార్యదర్శులు, యితర కార్యదర్శులను అభినందించారు. అందరి సమిష్టి కృషి తో ఈమేర బకాయిలు వసూలు చెయ్యడం జరిగిందని, ఇదే స్పూర్తి తో మిగిలిన బకాయిలు వసూలు చెయ్యాల్సి ఉంటుందన్నారు.