-సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలోనూ మార్పులు
-విద్యారంగంలో సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ పథకాలు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షురాలు జీ రాజకుమారి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మ విద్య ద్వారా విద్యార్థులు ఆత్మసైర్యంతో జీవించాలనే లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గం మండల కేంద్రమైన నందివాడలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో మూడేళ్ళ కిందట యోగా, ధ్యాన మందిర నిర్మాణానికి శంఖుస్థాపన చేశామన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మందిర నిర్మాణం జరగలేదన్నారు. ఈ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇప్పించాలని రాజకుమారి కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని చెప్పారు. దీనిలో భాగంగా మన బడి నాడు – నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తొలి దశలో సర్వ హంగులు సమకూర్చుకున్న స్కూళ్ళను సీఎం జగన్మోహనరెడ్డి ప్రజలకు అంకితం చేశారని తెలిపారు. ప్రస్తుతం రెండవ విడత నాడు – నేడు పనులు జరుగుతున్నాయని చెప్పారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, మేజర్, మైనర్ రిపేర్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, విద్యుద్దీకరణ, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, వంట గది, ప్రహరీగోడ నిర్మాణం జరుగుతున్నాయన్నారు. తొలి దశలో 15 వేల 715 స్కూళ్ళలో రూ. 3,669 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరంలో 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున రూ. 6,673 కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు. విద్యా బోధనలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఫౌండేషన్ స్థాయి నుండే పిల్లలకు సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలో నూతన మార్పులు చేస్తున్నారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం నాంది పలికిందని అన్నారు. విద్యార్థి సంపూర్ణ వికాసానికి విద్యతో పాటు మంచి పౌష్టికాహారం కూడా అవసరమని సీఎం జగన్మోహనరెడ్డి బలంగా నమ్మారని తెలిపారు. దీనిలో భాగంగానే మంచి పోషక విలువలున్న నాణ్యమైన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్నారని చెప్పారు. ఇందు కోసం రూ.1,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. విద్యాశాఖలో ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న అమ్మ ఒడి, మన బడి నాడు – నేడు , జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద తదితర కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ బడులు ఎలా ఉండాలి, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా పటిష్టంగా తీర్చిదిద్దాలనే దానిపై సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆలోచనతో ఉన్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.
Prajavartha Online Telugu News