విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 10వ తేదీన నెల్లూరు జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ తెలియజేస్తూ కరేడు గ్రామంలో షిర్డిసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీకి 8,458 ఎకరాల భూమిని అప్పనంగా అప్పగించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పావులు కదపడాన్ని ఖండిస్తున్నామన్నారు. బలవంతపు భూసమీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన కరేడు గ్రామ ప్రజలపై పోలీసులు అత్యంత నిర్భంధాయుతంగా వ్యవహరించడాన్ని, గ్రామస్తులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్ని దుర్మార్గమన్నారు.
ఇండోసోల్ కంపెనీకి రామాయపట్నం పోర్టు సమీపంలో భూములు ఇవ్వాలని గత జగన్ సర్కార్ నిర్ణయించగా, తెలుగుదేశం, జనసేనతో సహా కూటమి పార్టీలన్నీ ‘షిర్డీసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీ జగన్ బినామీ కంపెనీ అని, ఇదొక ల్యాండ్ స్కాం’ అంటూ ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కరేడు గ్రామంలోని భూములతోపాటు ఉప్పరపాలెం, రామకృష్ణపాలెం, బొట్టనగుంటలో తీసుకోనున్నారనీ, ఇందులో రెండు దళిత, గిరిజన గ్రామాలు సైతం కనుమరుగవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే కంపెనీకి గత ప్రభుత్వం కంటే ఇంకా అధికంగా భూములను ఎలా కట్టబెడతారు? భూములు సమీకరించే ముందు గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా? ఆనాడు విమర్శించిన ప్రస్తుత పాలకులు అధికారంలోకి వచ్చాక ఎందుకు కుమ్మక్కవుతున్నారు? అని రామకృష్ణ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బలవంతపు భూసమీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో గత వైసిపి ప్రభుత్వం తీసుకున్న అనేక ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారనీÑ నాడు అక్రమ భూ కేటాయింపులను, బలవంతపు భూసేకరణలను వ్యతిరేకించారనీÑ కానీ ఇప్పుడు వైసిపి అనాలోచిత నిర్ణయాలనే చంద్రబాబు కొనసాగించడం దుర్మార్గమన్నారు. కరేడు గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణకు పాల్పడడం తగదన్నారు. ఇండోసోల్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణ ఆపాలని, కరేడు గ్రామ ప్రజలపై నిర్బంధకాండ ప్రదర్శించిన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన కరేడు గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ ప్రతినిధి బృందం పర్యటించి, అక్కడ పరిస్థితులను తెలుసుకుని, ప్రజల ఆందోళనకు మద్దతు తెలుపనున్నది.
Prajavartha Online Telugu News