-ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జలహారతి
-గోదావరి జలాలకు హారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానం చేసి చూపించిన అపర భగీరధుడు. పట్టీసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబునాయుడు అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గరకు వచ్చిన గోదావరి జలాలకు బుధవారం జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కలెక్టర్ లక్ష్మీశా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జలహారతి సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జగన్ పట్టిసీమ ను వట్టిసీమ చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావటం వల్లే నదులకి జలకళ సంతరించుకుందన్నారు.గోదావరి, కృష్ణ నదుల అనుసందానం వల్ల కృష్ణా డెల్టా దిగువ భాగాన ప్రజలు, రైతులకు అవసరమైన తాగు, సాగునీటి కష్టాలు ఇబ్బందులు తొలిగాయన్నారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం చంద్రబాబు కష్టానికి ఫలితమని చెప్పారు. గత ప్రభుత్వం పంటల సంగతి కాదు కదా… కనీసం తాగటానికి నీళ్లివ్వండని మొరపెట్టుకున్నా కనికరించలేదన్నారు. ప్రతి సంవత్సరం సముద్రంలో వృథాగా కలుస్తున్న వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతం చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజ, టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి జంపాల సీతారామయ్య, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు , తూర్పు కృష్ణా డెల్టా కమిటీ చైర్మన్ దేవన బోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, జి కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు పజ్జూరు వెంకయ్య, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శీను లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News