Breaking News

స్వచ్ఛత ప్రతిఒక్కరి జీవన విధానంలో ఒక భాగం కావాలి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

-రాజమహేంద్రవరానికి ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ అవార్డు రావడం గర్వకారణం
-ఎమ్మెల్సీ సోము వీర్రాజు
-ఆరోగ్యకర రాజమహేంద్రవరం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
-స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం భాగం కావాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి పిలుపు ఇచ్చారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం స్థానిక  వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా నగరానికి ప్రతిష్టాత్మక ‘ప్రామిసింగ్ స్వచ్ఛ్ షహర్ అవార్డు’ వరించడంతో ఉత్తమ కార్మికులు అధికారుల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లు ముఖ్య అతిథిగా పాల్గొనగా.. తొలుత జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ.. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో రాజమహేంద్రవరం పారిశుధ్య నిర్వహణ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరచడం సంతోషదాయకమన్నారు. దీనికి కారణమైన పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలియజేశారు. పశ్చిమ దేశాలు గమనించినట్లయితే రోడ్లు, డ్రెయిన్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయని, కానీ ఇక్కడ రోడ్లపైన చెత్త, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నిత్యం దర్శనమిస్తుంటా యన్నారు. ఒక బాధ్యతగల పౌరుడిగా రోడ్లపైన, కాలువలలో చెత్త వేయకపోవడం పారిశుద్ధ్య కార్మికులకు మనం ఇచ్చే నిజమైన గౌరవమని కలెక్టర్ అన్నారు. అలాగే భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు ఎక్కడికి అక్కడే వదిలేయకుండా.. నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రదేశంలో పడవేయడం ద్వారా ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచుకోవచ్చన్నారు. నగరంలో ఫౌంటెన్ల నిర్మాణం వెనుక కూడా ఒక కారణం ఉందని. ఈ ఫౌంటెన్లు వెదజల్లే నీరు వలన దుమ్మును తగ్గించడం ద్వారా రహదారులను డస్ట్ ఫ్రీగా ఉంచేందుకు దోహదపడతాయన్నారు. మరోవైపు రానున్న పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరం లక్షలాది మంది భక్తులకు ఆతిధ్యం ఇవ్వనుందని.. ఇటువంటి తరుణంలో స్వచ్ఛ రాజమహేంద్రవరాన్ని నిర్మించుకోవలసిన ఆవశ్యకత , బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా మనం కలలు కన్న రాజమహేంద్రవరాన్ని నిర్మించుకోగలమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. వాజ్ పేయి హయాంలో కర్మచారి కార్మికుల చేత మలమూత్రాలు ఎత్తించకూడదని చట్టం చేశారని గుర్తు చేశారు. మరలా ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశం స్వచ్ఛ భారత్ దిశగా ముందుకు పయనిస్తోందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల పాదాలను ప్రధాని మోదీ కడిగిన తర్వాత పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రజల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని ఎమ్మెల్సీ అన్నారు. ప్రస్తుతం మన దేశం జపాన్ కన్నా ఆర్థికంగా మిన్నగా ఉన్నప్పటికీ.. పారిశుద్ధ్యంలో మాత్రం వెనకబడి ఉన్నామని పేర్కొన్నారు. కనుక ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాలలో వ్యక్తిగతంగా భాగస్వామ్యం పంచుకుంటేనే అటు దేశం, ఇటు నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం నగరానికి ప్రతిష్టాత్మక ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ అవార్డు రావడం గర్వకారణ మన్నారు. గత మూడేళ్లలో చూసుకుంటే 2022 లో 97 వ స్థానం., 2023 లో 59 వ స్థానంలో ఉన్న మన రాజమహేంద్రవరం నగరం 2024 లో దేశంలో ర్యాంకింగ్ లో 19 వ స్థానానికి చేరుకోవడం సంతోష దాయకమన్నారు. 2025 లో మొదటి స్థానం సాధించే దిశగా ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టం వర్ణణాతీతమని.. వారికి నీటి మునిగే ప్రాంతాల సమస్యను తగ్గించగలిగితే స్వచ్చ్ సర్వేక్షణ్ లో రాజమహేంద్రవరం నగరాన్ని మొదటి స్థానంలో నిలుపు తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని.. వీఎల్ పురం జక్కంపూడి రామ్మోహన్ రావు వీధిలోని మేజర్ డ్రెయిన్ లో డీసిల్టింగ్ చేసిన తరుణంలో దాదాపు 10 మినీ వ్యాన్ ల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. డ్రెయిన్ల వ్యవస్థను మెరుగు పరచేందుకు ఈ ఏడాది దాదాపు రూ. 40 నుంచి రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలియ చేశారు. అలాగే పుష్కర పనులలో భాగంగా మరికొన్ని పనులకు అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు వీరభద్రనగర్లో వర్షం పడితే రెండు గంటల పాటు రోడ్లపైన నీరు నిలిచిపోయి ఉండేదని.. కానీ ఇప్పుడు భారీ వర్షం కురిసినా 15 నిమిషాలలో నీరు వెళ్లిపోతోందని తెలిపారు. అలాగే ఆరోగ్యకర రాజమహేంద్రవరం నిర్మాణం ప్రతిఒక్కరి బాధ్యత కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఇంజనీరింగ్‌ కార్మికులకు రూ.3 వేల చొప్పున వేతనం పెంచడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. అలాగే విధులు నిర్వర్తిస్తూ మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇప్పించే దిశగా కూడా తాము కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు , అడిషినల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకట రమణ, సెక్రటరీ శైలజీ వల్లి, ఎంహెచ్ఓ వి. వినూత్న, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, మునిసిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *