మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తుందని ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం భారత ప్రభుత్వ సంస్థ జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్ ఎస్ ఐ సి)లిమిటెడ్, ఏపీ వాణిజ్యం పరిశ్రమల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఆ ర్కే ప్యారడైజ్ లో సూక్ష్మ చిన్న మధ్యతరహా వ్యాపారవేత్తల బృందం వ్యాపార సహకారం మార్కెటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవ అతిథిగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు. ప్రతి వ్యాపారవేత్తకు యూనిట్లు నెలకొల్పడానికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రాముఖ్యత ఇస్తామన్నారు.
ఎవరైనా పరిశ్రమలు నెలకొల్పాలంటే ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చో ఎంపిక చేసుకునేందుకు, వారికి కావలసిన భూమి కేటాయించేందుకు, కావలసిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు తమ కార్యాలయం అన్ని విధాల సహకరిస్తుందన్నారు.
అంతేకాకుండా పరిశ్రమలు ఏర్పాటు చేశాక కావలసిన మార్కెటింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు.
ఓపెన్ నెట్వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్( ఓ ఎన్ డి సి) పోర్టల్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని వారు ఎవరికంటే కూడా తక్కువ కాదన్నారు.
పరిశ్రమలు నెలకొల్పే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మహిళలకు 45% రాయితీ ఉందన్నారు. చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు 4 1/2 కోట్ల రూపాయల వరకు రాయితీ లభిస్తుందన్నారు. గతంలో ఓసి మహిళలకు 20 లక్షల రూపాయలకు మించి రాయితీ లేదన్నారు. ప్రభుత్వం పరిశ్రమ నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీ, విద్యుత్ రాయితీ అమ్కకం పన్ను రాయితీ వంటి సదుపాయాలు కల్పిస్తోందన్నారు. భూమి కొనుగోలు చేస్తే దానికైనా చార్జీలు కూడా తిరిగి చెల్లింపు చేస్తామన్నారు. పరిశ్రమలు నడుపుతున్న వారు విస్తరించాలనుకుంటే 40% పెట్టుబడి రాయితీ కూడా 4 1/2 కోట్ల రూపాయల వరకు ఇస్తోందన్నారు.
ఎన్ఎస్ఐసి సీనియర్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ ఓ ఎన్ డి సి లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు వారు తయారుచేసిన ఉత్పత్తులను, కళాకృతులను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల మాదిరిగా స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తుందన్నారు. అంతే కాకుండా ప్యాకింగ్, స్థానికంగా అమ్మకము, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సహాయపడుతుందన్నారు. ఈ వినూత్న పద్ధతిలో భాగస్వాములు చేయడానికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో వినియోగదారులను విస్తృతంగా చేరుకునే అవకాశం కల్పిస్తుందన్నారు.
ఏపీ వాణిజ్యం పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పుట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలలో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమాఖ్యలో మహిళా వ్యాపారవేత్తలను కూడా భాగస్వాములు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు కావలసిన అన్ని రకాల పాలసీలను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తున్నామన్నారు. జిల్లాలో పరిశ్రమలు విరివిగా నెలకొల్పేందుకు ఓ ఎన్ డి సి తో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటుకు సమాఖ్య చొరవ చూపిందన్నారు. నేడు జరిగిన అవగాహన కార్యక్రమంలో 100 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సంతోషదాయకమన్నారు.
అనంతరం మై స్టోర్, లాగ్రోస్, ఇంటిగ్రా సంస్థల నిపుణులు బ్లెస్సీ, భాగ్య రావు, శివ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓఎన్ డిసి కార్యకలాపాలు వివిధ వ్యాపారాలలో మార్కెటింగ్ సౌకర్యం గురించి వివరించారు
ఈ కార్యక్రమంలో హ్యాండీక్రాఫ్ట్స్ సహాయ సంచాలకులు లక్ష్మి, ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఇమిటేషన్ జ్యువలరీ ప్రతినిధి జితేంద్ర,. పారిశ్రామికవేత్తలు అపర్ణ, రాధిక పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News