రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీసు శాఖ, తూర్పుగోదావరి జిల్లా, ది రాజమండ్రి కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్, ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం నగరంలో యాంటీబయోటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ మరియు సదస్సు నిర్వహించబడింది. జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పచ్చ జెండా ఊపి ప్రారంభ సూచన ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ వాడడం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, అందువల్ల అన్ని వర్గాలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇప్పటికే రెండు డ్రగ్ డి-అడిక్షన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారికి ఈ కేంద్రాల్లో కౌన్సిలింగ్ అందిస్తున్నామని తెలిపారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయంపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారిపై పీడీ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, వైద్యుల సూచనల మేరకు మాత్రమే మందుల విక్రయాలు జరగేలా చర్యలు తీసుకుంటామని, నిర్బంధిత నిబంధనలు పాటించని మెడికల్ షాపులపై చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), డీఎస్పీ (సెంట్రల్ జోన్), ఇన్స్పెక్టర్లు, డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు, నగరంలోని మెడికల్ షాపుల యాజమానులు, ది రాజమండ్రి హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. డ్రగ్ వినియోగంపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శించబడినాయి.
Prajavartha Online Telugu News