-దేశవ్యాప్తంగా 11,768 ,ఎపీలో 1,500 మంది వెటర్నరీ డాక్టర్లకు, శిక్షణ
-కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రొ. ఎస్. పి. సింగ్ బఘేల్ వెల్లడి
-భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) సంస్థల వివరాల పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదు సంవత్సరాల్లో మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, పరిశోధనల కోసం దేశవ్యాప్తంగా 20కి పైగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) సంస్థలకు కేంద్రం రూ.15,181.87 లక్షల నిధులు కేటాయించింది. ఇందులో జంతు ఆరోగ్య విభాగంలోని సంస్థలకు రూ.4,468.81 లక్షలు, మత్స్య విభాగంలోని సంస్థలకు రూ. 10,713.06 లక్షలు కేటాయించగా, వరుసగా ₹2,687.38 లక్షలు, రూ.5,675.22 లక్షలు విడుదల చేసినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రొ. ఎస్. పి. సింగ్ బఘేల్ వెల్లడించారు.
లోక్ సభలో మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) సంస్థల వివరాలపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రొ. ఎస్. పి. సింగ్ బఘేల్ లిఖిత పూర్వకంగా బదులు ఇచ్చారు.
పశు వ్యాధుల నియంత్రణ పథకం (ASCAD) కింద, రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల డిమాండ్ మేరకు దేశవ్యాప్తంగా 11,768 మంది ఇన్-సర్వీస్ వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ అందించగా, వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో 1,500 మంది డాక్టర్లు శిక్షణ పొందినట్లు వివరించారు.
రైతులకు పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు బ్లాక్ స్థాయిలో నిర్వహించిన ప్రచారం, అవగాహన కార్యక్రమాలకు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం రూ.3,248.50 లక్షలు కేటాయించగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.381.20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. వీటితో పాటు అదనంగా, ప్రసార్ భారతి ద్వారా అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ప్రకటనల కోసం రూ. 9,786.98 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ చర్యలు పశు ఆరోగ్య రక్షణ, వ్యాధుల నియంత్రణ, పరిశోధనలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా, పశుసంవర్ధక రంగంలో సాంకేతిక అభివృద్ధికి దోహదం చేస్తాయని కేంద్ర మంత్రి ప్రొ. ఎస్. పి. సింగ్ బఘేల్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News