Breaking News

అధిక వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి… : కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న నాలుగైదు రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు ఉన్న అధికారులు, సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టకుండా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డి ఆర్వో టి. సీతారామ మూర్తి లతో కలిసి జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ వనరబుల్ ప్రాంతాల్లో రక్షణ చర్యలు తక్షణం చేపట్టాలని, స్థానిక పరిస్థితులను అనుసరించి ముంపు ముప్పు ఉన్న పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, కాలువలు, చెరువులలో స్నానానికి వెళ్లే పిల్లలు, యువకులను నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఏటిగట్లు, కాలువ గట్ల పటిష్టతపై తనిఖీలు జరపాలని తెలిపారు.

అధిక వర్షాల వల్ల కలిగే పంటనష్టం, రహదారి దెబ్బతినడం, ప్రజా సౌకర్యాల లోపాలపై వివిధ ప్రభుత్వ శాఖలు అంచనా వేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ, రోడ్లు-భవనాలు, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్ మరియు పౌర సరఫరాల శాఖలు తమ పరిధిలో నష్టపరిచిన వనరులను సమీక్షించి, ఖచ్చితమైన గణాంకాలతో కూడిన నివేదికలను 24 గంటల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా తక్షణ సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.

ఆరోగ్య మరియు శానిటేషన్ చర్యలు
ఆరోగ్య శాఖ అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అన్ని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి, తగిన వైద్య సిబ్బంది విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షం వల్ల నీటిమునిగిన ప్రాంతాలు, డ్రైనేజీలు, మురుగునీటి ప్రవాహాలు శుభ్రపరచడం, చెత్త నిల్వలు తొలగించడం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్, గ్రామ పంచాయతీలు, ఆరోగ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. వర్షానంతరం వ్యాధుల వ్యాప్తి నివారణ కోసం క్లోరినేషన్, యాంటీ లార్వా స్ప్రే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

ఇప్పటికే జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో 24 గంటల కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితులు, ప్రమాద సూచనలు గమనించిన వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి జిల్లా డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ లు

కలెక్టరేట్ లో జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్: 8977935611

రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో  కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 0883-2442344

కొవ్వూరు డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 08813-231488

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని కంట్రోల్ రూమ్ నెంబర్ : 9494060060

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *