-వ్యర్ధాలను ప్రతిరోజు కచ్చితంగా తొలగించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడ ను ఉంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం, ప్రతి రైతుబజార్లో గుడ్డ సంచుల కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్, మహానాడు రోడ్డు, లోయోలా కాలేజ్ రోడ్డు, డెంటల్ కాలేజ్ రోడ్డు ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడ ను ఉంచాలనే లక్ష్యంతో ప్రతి రైతు బజార్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన గుడ్డ సంచులను అమ్మే కౌంటర్లను ఏర్పాటు చేయాలని, అలా చేయటం వల్ల ఒకవైపు ప్లాస్టిక్ రహిత పర్యావరణహితమైన వస్తువులను అమ్మటమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్టు ఉంటుందని కమిషనర్ అన్నారు. లోయోలా కాలేజ్ రోడ్డులో పేరుకుపోయిన వ్యర్థాలను గమనించి వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఎందుకు తొలగించలేదని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్ధాలు తరలించేందుకు వాహనాలన్ని అందుబాటులో ఉంచాలని, రిపేర్ లో ఉన్న వాహనాలను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని, ప్రతిరోజు వ్యర్థాలను కచ్చితంగా తీయాలని, ప్రధాన రహదారుల్లో కంపాక్టర్ బిన్స్ లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు ఇంటి వద్దనే వ్యర్ధాల సేకరణ జరగాలని, సేకరించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కి తరలించాలని, నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వ్యర్ధాల నిర్వహణ జరగాలని అధికారులను ఆదేశించారు.
మహానాడు రోడ్డులో ఔట్ఫాల్ డ్రైన్ ని పరిశీలించి, డ్రైన్ లో నీరు నిలిచి ఉండకూడదని నిరంతరాయంగా వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాలని, అందుకు పట్టణ ప్రణాళిక వారి మార్కింగ్లను అనుసరిస్తూ, ఆక్రమణలను తొలగిస్తూ, డ్రైన్ లో నీరుపారుదల చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మొక్కల శాతం లో పెంచమని కమిషనర్ ఆదేశించగా, ఆదేశాలకు అనుగుణంగా డెంటల్ కాలేజ్ రోడ్డులో అమర్చిన పూల మొక్కలను పరిశీలించి, నగరంలో మొక్కల శాతను మరింత పెంచి నగర సుందరీకరణలో మొక్కలను కూడా ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూ సి డి పి వెంకటనారాయణ, పర్యవేక్షణ ఇంజనీర్ పి. సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, సిడిఓ ఉమామహేశ్వరి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News