అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శనివారం రాత్రి 9 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.7 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 9 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 10.01 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మండల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద 2.99 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని వెల్లడించారు.
గోదావరి,కృష్ణా,తుంగభద్ర నదుల వరద ప్రవాహంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Prajavartha Online Telugu News