తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో ఉపాధ్యాయులకు ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలో ఒకరు హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసి, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, మోమెంటో అందజేసి గౌరవించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. హరిప్రసాద్ భారతీయ సంస్కృతిలో గురువుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ – “ప్రాచీన గురువులైన వశిష్టులు, విశ్వామిత్రులు, శుక్రాచార్యుడు నుండి ఆధునిక గురువులైన రామాణుకాచార్యులు, స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస స్వామి వరకు గురువుల గొప్పతనం మన సంస్కృతికి అద్దం పట్టింది. మన సంప్రదాయంలో ‘మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ’ అని చెప్పడం యాదృచ్ఛికం కాదు. తల్లి మనకు జన్మనిస్తుంది, తండ్రి జీవనానికి పునాది వేస్తాడు, గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు. అందుకే గురువులు నిజమైన దేశనిర్మాణ శిల్పులు” అని పేర్కొన్నారు. తన జీవితంలో గురువుల ప్రభావం గురించి ప్రస్తావిస్తూ – డాక్టర్ కావడానికి మౌలాలి, దేవదాస్ మార్గదర్శనం చేశారు. రాజకీయ రంగంలోకి రావడానికి చిరంజీవి ప్రేరణ ఇచ్చారు. ఇప్పుడు ఇలా గొప్ప స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం లాంటి మార్గదర్శకత్వం అందించారు.
“ఇలాంటి గొప్ప గురువులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలియజేస్తూ, వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.
అలాగే “ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి గురువులను గౌరవించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా సంస్కృతిని కాపాడే గొప్ప పనిని చేశారు” అని డా. హరిప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తరఫున కూడా నాని కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, రాష్ట్ర బ్యూటిఫుల్ & గ్రీనరీ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, తిరుపతి మునిసిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ, జిల్లా విద్యా శాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News