– ఎక్కడా యూరియా కొరత లేదు
– రైతులు అవసరం మేరకే ఎరువులు వినియోగించాలి
– నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, గౌరవ ముఖ్యమంత్రివర్యుల సూచనల మేరకు ఎరువుల పంపిణీ జరుగుతోందని.. ఎక్కడా యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ.. జి.కొండూరులో పర్యటించారు. మండలంలో ఎరువుల పంపిణీ స్థితిగతులను పరిశీలించారు. రైతులతో ముచ్చటించి, పంటల దశల వారీగా వినియోగించాల్సిన మోతాదుపై అవగాహన కల్పించారు. డ్రోన్ల ద్వారా నానో యూరియాను పిచికారీ చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని.. రైతులు అవసరం మేరకు యూరియా, ఇతర ఎరువులను వినియోగించాలని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సూచనలను పాటించాలని సూచించారు. గత మూడు రోజులుగా ఎరువులపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని.. సమీప సొసైటీలో ఎరువుల నిల్వలు, వచ్చే వారం రోజుల్లో కొత్తగా వచ్చే ఎరువుల పరిమాణం, నానో యూరియా ప్రయోజనాలు, యూరియాను ఏ దఫా ఎంత వేయాలి.. తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 32 డ్రోన్ల ద్వారా నానో యూరియా స్ప్రేయింగ్ డెమో నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం ఎరువుల రవాణా, సరఫరాపై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఎరువులను అందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News