-ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సత్యనారాయణపురంలోని గాయత్రి కన్వెన్షన్ సెంటర్ లో గాయత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, రాష్టప్రతిగా దేశానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని కొనియాడారు. పేద కుటుంబంలో జన్మించినా కష్టపడి చదవి.. భారతదేశానికే విజ్ఞాన సంపదగా నిలచారన్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్టప్రతిగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. భారతీయ విద్యావ్యవస్థకు రాధాకృష్ణన్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తుచేసారు. ఉపాధ్యాయుల దినోత్సవం ప్రత్యేకమైందని.. గురువులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలిగేది ఒక్క ఉపాధ్యాయులు మాత్రమేనని అన్నారు, వారి జ్ఞానాన్ని వెలకట్టలేమన్నారు. సమాజంలో గురువులకు లభించే గౌరవం.. ఎంత గొప్పవారైనా ఇతర రంగాల వారికి లభించదన్నారు. విద్యార్ధి సమాజానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ అని పేర్కొన్నారు. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలను నెరవేరుస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలిగోవింద్, ఉద్ధంటి సునీత, కొండాయిగుంట మల్లేశ్వరి, ఉమ్మడి రమాదేవి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైఎస్సార్ సీపీ టీచర్స్ యునియన్ నాయకులు ఇంతియాజ్, గాయత్రి సేవాసంఘం సభ్యులు జె.కె.సుబ్బారావు, కొండా, వై.సుధీర్, మారుతి, సనత్, జగదీష్, డి.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, టి.గోపాలకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News