తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి లోని తాజ్ హోటల్‌లో జరిగిన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్‌ల సమావేశానికి విచ్చేసిన పర్యాటక, సాంస్కృతిక మరియు చిత్ర పరిశ్రమ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తో కలిసి సమావేసంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన రాష్ట్ర పిఎసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ… తిరుపతి భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రంగా, రోజుకు మూడు లక్షల మందికి పైగా యాత్రికులను, పర్యాటకులను ఆకర్షిస్తోందని తెలిపారు. తిరుపతి అభివృద్ధి కేవలం ఆలయ దర్శనానికి మాత్రమే పరిమితం కాకుండా, సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడం అత్యవసరం అని అన్నారు. ఆలయ పర్యాటకం ప్రధానమైనప్పటికీ, దానితో పాటు పర్యాటకులకు సాంస్కృతిక, వినోద, విశ్రాంతి అనుభవాలు లభించేలా అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రిసార్ట్‌లు, “కంట్రీ రిసార్ట్‌లు” వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనితో తిరుపతి ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక పర్యాటకానికి కూడా కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. పర్యాటక సేవల్లో డిజిటల్ సౌకర్యాలతో పాటు ఆఫ్‌లైన్ సౌకర్యాలు కూడా సమకూర్చడం ద్వారా మరింత మంది యాత్రికులకు సౌలభ్యం కలుగుతుందని, ఆధునిక అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
స్థానిక కళలు, హస్తకళలు తిరుపతి ప్రత్యేకత అని చెబుతూ – కలంకారి, నారాయణవరం కళలు, చిత్తూరు జిల్లాకు చెందిన ప్రత్యేక హ్యాండీక్రాఫ్ట్‌లు పర్యాటక ఆకర్షణలుగా రూపుదిద్దుకుంటే, పర్యాటకులకు విభిన్న అనుభవాన్ని అందించడమే కాకుండా స్థానిక కళాకారులకు ఆర్థికంగా బలం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా దివ్యాంగులు తయారు చేసే హస్తకళ ఉత్పత్తులు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు వస్తే, అది చిత్తూరు జిల్లా ప్రతిభను దేశం మొత్తం గుర్తించడానికి మార్గం చూపుతుందని తెలిపారు.
తిరుపతి పర్యాటక అభివృద్ధి కోసం పర్యాటక సమాచార కేంద్రాలు, బస్సు సేవలు, భారీ జనసందోహాన్ని నిర్వహించే సదుపాయాలు, ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం అవసరమని సూచించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం లభించిందని, ప్రస్తుతం ప్రధానమంత్రి నుండి కూడా తిరుపతి అభివృద్ధికి తగిన మద్దతు, గుర్తింపు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతిని సమగ్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, ఇది ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక, ఆర్థిక, కళాత్మక రంగాల అభివృద్ధికి కేంద్రబిందువుగా మారుతుందని హరిప్రసాద్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట, తిరుపతి జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ డా. వెంకటేశ్వర్ ఎస్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈఓ ఎ. శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, మాజీ సిఐఐ చైర్మన్ రవందాస్ దామోదర్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే వెంకట మణి ప్రసాద్ (పుల్లివర్తి నాని), యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. సుగుణమ్మ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News