మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ నందివాడ, బాపులపాడు మండలాల్లో పర్యటించి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు చేస్తున్న ఫిష్ ట్యాంకులను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ నందివాడ మండలం అరిపిరాల గ్రామం, అనంతరం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో రైతు కుమార్ రాజు తాను స్వయంగా తయారు చేసుకున్న పరికరాలతో చేపలకు మేత వేసే వినూత్న పద్ధతిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు కుమార్ రాజు మాట్లాడుతూ తాను 3 ఎకరాల చేపల చెరువుకు ఉపయోగపడే విధంగా ఒక సమయం నిర్ధారించుకుని సెట్ చేస్తే ఆ ప్రకారంగా 360 డిగ్రీలతో పైపుల ద్వారా అంతటికి ఒకే మాదిరిగా రైల్వే ట్రాక్ లాగా వెళుతూ ఎంత ఆహారం వేస్తాము అది చెరువు అంతా సమానంగా వెదజల్లుతూ వెళ్తుందన్నారు.
తొలి దశలో తాము తయారు చేసినప్పుడు 60 వేల రూపాయలు ఖర్చు అయిందని, ప్రస్తుతం 1.50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. డొమెస్టిక్ మార్కెట్లో ప్రస్తుతం ఒక శాతం మాత్రమే చేస్తున్నారని, తూర్పుగోదావరి జిల్లాలో యూనిట్ల ఏర్పాటుకు తమ దగ్గర నుండే పరికరాలను పంపుతున్నామన్నారు. ఈ కొత్త విధానం వల్ల రైతులకు కూలీల ఖర్చు, మేత ఖర్చు ఆదా అవుతాయన్నారు.
ఈ వినూత్న పరికరాల ఆక్వా సాగు విధానాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి రైతు కుమార్ రాజును అభినందించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, పలువురు రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News