-వైసీపీ కుట్రలు, కుయుక్తులను తిప్పికొడదాం
-ఓట్లు, సీట్లు కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు
-చిన్న చిన్న గొడవలకు రాజకీయ రంగు పులుముతున్నారు
-సామాజిక మాధ్యమాల ముసుగులో దుష్ర్పచారం
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మే కుట్ర సాగుతోంది
-జన సైనికులు, వీర మహిళలు ఆవేశాలకు లోనై ఘర్షణ వాతావరణం సృష్టించవద్దు
-శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు
-ఎవరు తప్పు చేసినా చట్టం ముందు నిలబెడతాం
-వైసీపీ హయాంలో కోనసీమ అల్లర్లు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డా. సుధాకర్ ని వేధించడాన్ని మరచిపోలేదు
-తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
కులాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో చీలిక తీసుకురావాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారు. సమస్యలు, సవాళ్లు దాటి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ముసుగులో కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విషం చిమ్మే కుట్రతో కూడిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజంలో అశాంతి, అభద్రత సృష్టించేలా వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ర్పచారాన్ని జనసేన నాయకులు, వీరమహిళలు జాగ్రత్తగా గమనించి వాటిని తిప్పికొట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ నాయకుల ఎత్తుగడలు తెలుసుకోకుండా ఆవేశాలకు లోనై ఘర్షణ వాతావరణానికి తావివ్వవద్దన్నారు. కూటమి పాలనలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఆదివారం సాయంత్రం తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, సామాన్యుడికి రాజకీయాలు చేరువ చేయాలనే సదుద్దేశంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేపట్టలేదు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగానే జనసేన గళం వినిపించింది. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం వంటివి జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు. ఏ ఇతర రాజకీయ పార్టీల్లో ఇలాంటి సిద్ధాంతాలు ఉండవు. పార్టీ స్థాపించినప్పుడు ఏ నిబద్ధతతో పని చేశామో… అధికారంలో భాగస్వామ్యం ఉన్నా ఇప్పటికీ అదే కమిట్మెంట్ తో పని చేస్తున్నాం. సందర్భం, అవసరాలను బట్టి సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాద రాజకీయాలకు జనసేన పార్టీ దూరం.
జనసేన పార్టీ ఎప్పుడూ యువతకు బంగారు భవిష్యత్తు ఉండాలని, రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని, మహిళలకు భద్రత ఉండాలనే కోరుకుంటుంది.
• వైసీపీ అరాచకాలు మరచిపోలేదు
వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు ఎవరూ మరిచిపోలేదు. సమాజంలో చీలిక తెచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నారు. ఆనాడు బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడా వైఎస్ జగన్ గారు పచ్చటి కోనసీమ అమలాపురంలో కులాల కుంపటి రాజేశారు. అప్పటి మంత్రి విశ్వరూప్ ఇంటి మీద దాడి జరిగితే ఒక్క ముక్క మాట్లాడలేదు. ఆనాడు ధైర్యంగా నిలబడి, సామరస్యపూర్వకంగా మాట్లాడిన నాయకుడు పవన్ కళ్యాణ్.
కూటమి ప్రభుత్వం పాలన మొదలైన దగ్గర నుంచి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని వైసీపీ కుట్రలు చేస్తోంది. కైకలూరు, మచిలీపట్నంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలకు రాజకీయ రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.
• అప్పుడు ఫోన్లు పనిచేయలేదా జగన్?
మచిలీపట్నం ఘటన జరగగానే జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తమ ప్రభుత్వం వస్తుందనీ… రాగానే వారి సంగతి తేలుస్తామని బెదిరింపు మాటలు మాట్లాడారు. ఆయన ఎవరి సంగతి తెలుస్తారు? మచిలీపట్నంలో జరిగిన చిన్న వివాదానికే ఫోన్ చేసి పరామర్శించిన జగన్.. నాడు దళిత యువకుడయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరి చేసినప్పుడు ఎందుకు ఆ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించలేదు? జగన్ క్యాబినెట్ లో మంత్రి విశ్వరూప్ గారి ఇంటిపై దాడి జరిగినప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదు? డాక్టర్ సుధాకర్ ను ఏ విధంగా ఇబ్బందిపెట్టి వేధించారో చూశాం. అప్పుడు ఎందుకు ఫోన్ చేసి పరామర్శించలేదు? అప్పుడు ఫోన్లు పని చేయలేదా? ఇప్పుడు ఫోన్ చేసి ప్రభుత్వం వస్తుంది… వచ్చినప్పుడు వాళ్ల సంగతి తేలుద్దాం అని బెదిరించడం ఎంత వరకు సబబు? ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి కాంట్రాక్టర్లను బెదిరిస్తారు. మరోవైపు గంజాయి మత్తులో పక్కదారిపడుతున్న యువతను దారిలో పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు దారి తప్పాయని నానాయాగీ చేస్తారు. పిఠాపురంలో అదే విధంగా చేశారు. దేని కోసం ఇదంతా?
ప్రజలు ఐదేళ్లు పాలించమని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పాలన ఉంటుంది. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఎవరూ తప్పు చేసినా చట్టం ముందు నిలబెడతాం.
• సామాజిక మాధ్యమాల ముసుగులో నీచ రాజకీయాలు
కులాల మధ్య చిచ్చుపెడితే ఓట్లు, సీట్లు పెరుగుతాయని వైసీపీ నాయకులు దురాలోచనలో ఉన్నారు. అందుకే రాష్ట్రంలో కులాల కుంపట్లు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలను పెద్దవిగా చిత్రీకరిస్తున్నారు. గ్రామాల్లో జరిగే ఫ్లెక్సీ గొడవలు, ఊరేగింపు గొడవలకు రాజకీయ రంగు పులుముతున్నారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ముసుగులో కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి. ప్రజలకు మంచి చేయడంలో పోటీపడండి. మంచి అభ్యర్థులను నిలబెట్టండి. అంతే తప్ప సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ, నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
• వైసీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలి
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని తపన పడే పార్టీ జనసేన. మాకు ప్రత్యేకమైన అజెండాలు ఉండవు. మా పార్టీకి ఉన్న ఏకైక అజెండా.. భారతదేశంలో ఏపీ ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. దాని కోసమే మేము పనిచేస్తాం. అందుకోసమే పవన్ కళ్యాణ్ నాలుగు మెట్లు దిగి కూటమి కోసం బలంగా నిలిచారు. జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఏనాడు కూడా స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయలేదు. మచిలీపట్నం సంఘటన పార్టీ దృష్టికి రాగానే నాయకులను క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పాము. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. సమాజంలో చిచ్చులు పెట్టే విధంగా వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని జనసైనికులు, వీరమహిళలు తిప్పికొట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె. వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు మేకల చిట్టిబాబు, ఇస్మాయిల్ బేగ్, గౌరీశంకర్, టి.వి.రమణారావు, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News