-భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి
-టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల పవిత్రత కాపాడటమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు స్మూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో ఆయన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
– 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.
– జిల్లా పాలన, పోలీసులతో కలిసి సూక్ష్మ- క్షేత్రస్థాయి ప్రణాళికలు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు.
– ఇప్పటికే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తి.
– ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు గరుడసేవ.
– ధ్వజారోహణం రోజు (సెప్టెంబర్ 24) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 25న పిఏసి-5ను ప్రారంభం.
– సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.9.50 కోట్లు, విద్యుద్దీపాలంకరణకు రూ.5.50 కోట్లు కేటాయింపు. దాతల విరాళాల ద్వారా రూ.3.50 కోట్లతో పుష్పాలంకరణ.
– పుష్పాలంకరణకు 60 టన్నుల పుష్పాలు వినియోగం.
– బ్రహ్మోత్సవ రోజుల్లో సిఫార్సు లేఖల ద్వారా గదుల కేటాయింపులు రద్దు. ఈ సమయంలో 3500 గదులు ఆఫ్‌లైన్‌లో సాధారణ భక్తులకు మాత్రమే కేటాయింపు.
– భక్తులు వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.
– 1.16 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు, రోజూ 25 వేల SSD టోకెన్లు (గరుడసేవ మినహా) విడుదల. అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. వీఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం.
– రోజూ 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్.
– 20 హెల్ప్ డెస్కులు ఏర్పాటు. ప్రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా నియామకం.
– గరుడసేవ రోజున భక్తులకు 14 రకాల వంటకాలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ.
– తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు.
– తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, AP టూరిజం ఓపెన్ ఏరియాల్లో మొత్తం 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయింపు.
– పార్కింగ్ ప్రదేశాల నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సులు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా 1900 ట్రిప్పులు, గరుడసేవ రోజున 3200 ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు.
– 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 పోలీసు సిబ్బంది, 450 సీనియర్ అధికారులు విధులు.
– 3500 మంది శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు సేవలు.
– 3000 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం.
– పారిశుద్ధ్యం కోసం 2300 సిబ్బందితో పాటు, 960 మంది అదనపు సిబ్బంది నియామకం.
– కల్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో 1150 మంది క్షురకులు.
– గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన 298 బృందాల ప్రదర్శనలు.
– గరుడసేవ రోజున 20 రాష్ట్రాల నుండి వచ్చిన 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శన.
– భక్తులకు వైద్య సేవలు అందించేందుకు 60 డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది.
– అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 14 అంబులెన్స్ లు ఏర్పాటు.
ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సిఈ సత్య నారాయణ, తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News