తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసం దెబ్బతింటోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వేర్వేరుగా లేఖలు రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పరకామణిలో దొంగతనం, దుర్వినియోగం జరిగిందని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో పేర్కొన్నారు. తిరుమల పరకామణి కేవలం నిధుల సమాహారం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తుందని, వారి నమ్మకం సడలిపోయేలా చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం మత సామరస్యాన్ని, మతపరమైన సంస్థల పవిత్రతను కాపాడాలని స్పష్టం చేస్తోందని గుర్తు చేసిన ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.
రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి మతాన్ని వాడుకోవడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో నిజానిజాలను వెలుగులోకి తేవడానికి, భక్తుల విశ్వాసాన్ని కాపాడడం కేవలం సీబీఐ విచారణ ద్వారానే సాధ్యమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. స్వతంత్ర సీబీఐ దర్యాప్తు ద్వారా తప్పుడు ఆరోపణలకు తెరపడుతుందని, తిరుమల పవిత్రత కాపాడబడుతుందని, కోట్లాది భక్తుల విశ్వాసం బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయం ఎప్పటికీ రాజకీయాల నుండి దూరంగా ఉండాలని, కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు.
Prajavartha Online Telugu News