మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమన్వయంతో పకడ్బందీగా చేయాలని సంపూర్ణ పర్యవేక్షణ అధికారి, సిఆర్ పి ఎఫ్ డిఐజి కమలేష్ సింగ్ అధికారులను ఆదేశించారు.
ఈనెల 24వ తేదీన నూతన ఉపరాష్ట్రపతి సి పి రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం సిఆర్పిఎఫ్ డిఐజి కమలేష్ సింగ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ఇంటలిజెన్స్ భద్రత విభాగం డిఐ జి. హఫీజ్, జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్ కె రెడ్డి లతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సంబంధిత అధికారులతో ముందస్తు భద్రత ఏర్పాట్లపై ( ఏ ఎస్ ఎల్) సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు ఉపరాష్ట్రపతి రాకపోకలు, స్వాగత కార్యక్రమాలపై చర్చించి విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఉపరాష్ట్రపతి పర్యటించు మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీఆర్పీఎఫ్ డీఐజీ కమలేష్ సింగ్ అధికారులకు సూచించారు.. రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు కేంద్ర భద్రతా దళాలు సమన్వయంతో పని చేయాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లు కూడా సిద్ధంగా ఉంచాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఈనెల 24వ తేదీన సాయంత్రం 4:20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, తదుపరి 5 గంటలకు విజయవాడకు చేరుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారని, అనంతరం 5:40 గంటలకు పున్నమి ఘాటును సందర్శించి 7:20 గంటలకు బయలుదేరి తిరుపతికి వెళతారన్నారు. ఉపరాష్ట్రపతికి ఆహ్వానం పలుకు ప్రముఖుల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వారు వరుస క్రమంలో ఉండేలాగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపరాష్ట్రపతికి పోలీసు గౌరవ వందనం పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సురక్షిత ఆసుపత్రిగా పిన్నమనేని ఆసుపత్రిని, కంటిన్యూజెన్సీ ఆసుపత్రిగా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఉపరాష్ట్రపతి, వారి సతీమణి రక్తపు గ్రూపులను, అంబులెన్స్లను, కావలసిన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.nఉపరాష్ట్రపతి, ప్రముఖులకు అందజేసే ఆహారాన్ని నిబంధన మేరకు పరీక్షించాలన్నారు. వాహన శ్రేణిలో ఉపయోగించే వాహనాల స్థితిగతులు సరిగా ఉన్నాయా లేదా గమనించాలన్నారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే ప్రముఖులకు మంచినీరు ఏర్పాటు చేయాలన్నారు. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖుల కోసం గ్రీన్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. పాములు పట్టే వారిని కూడా అందుబాటులో ఉంచి పాములు విమానాశ్రయం లోపలికి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు.
గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ వరకు రహదారి మార్గంలో రాకపోకలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టాలని, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఉపరాష్ట్రపతి ప్రయాణించు జాతీయ రహదారి మార్గంలో వీధి దీపాలు సరిగా వెలిగేలా చూడాలని, గుంతలు లేకుండా సరిచేయాలన్నారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల డ్రోన్లు ఎగరకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీ పాసులను సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఏఎస్ఎల్ అధికారి సిఆర్పిఎఫ్ కమాండెంట్ ధర్మ బీర్ జకర్, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ తేజ్ బహదూర్, డిపిఓ డాక్టర్ జే.అరుణ, డిఎస్ఓ మోహన్ బాబు, పౌరసరఫరాల సంస్థ డిఎం శివరాం ప్రసాద్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఏ వెంకట్రావు, డిటిఓ శ్రీనివాస్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం,గన్నవరం ఎంపీడీవో స్వర్ణలత, తహసిల్దారు శివయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News