-జీఎస్టీ అవగాహన ర్యాలీలో ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడం రైతులకు పెద్ద ఊరట కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయని వివరించారు. భీమవరం లూథరన్ స్కూల్ మైదానంలో మంగళ వారం “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చడలవాడ నాగరాణి స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. పరిణితి తో కూడిన కలెక్టర్ డ్రైవింగ్ చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మంత్రి శ్రీనివాస వర్మ కూడా నాగరాణి తో కలిసి ట్రాక్టర్‌లో ప్రయాణించారు. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కూడా ట్రాక్టర్ నడిపి రైతులకు ప్రోత్సాహం ఇచ్చారు.
సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయని మంత్రి వివరించారు. 12 లేదా 7 శాతం ఉన్న పన్ను ఇప్పుడు 5 శాతానికి పరిమితం కావడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. ఆరోగ్య, విద్య, బీమా రంగాల్లో కూడా జీఎస్టీ తగ్గిందని తెలిపారు. కొన్ని వస్తువులు జీరో శాతానికి తగ్గించబడ్డాయని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు పాకాల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా వ్యవసాయ రంగం 2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబం నెలకు రూ 3,000 – 5,000 వరకు ఆదా చేసుకోవచ్చని అన్నారు.
కలెక్టర్ నాగరాణి జీఎస్టీ తగ్గింపు వల్ల సాధారణ ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తోందని చెప్పారు. ఆహారం, మందులు, పాఠ్యపుస్తకాలు, బట్టలు, రవాణా వంటి వాటికి పన్నులు తగ్గించారని వివరించారు. మత్స్యకారులు, చిన్నతరహా వ్యాపారులు, నేత కార్మికులు, శిల్పులు, జిమ్‌లు, టూరిజం, లాజిస్టిక్స్ రంగాల వారికి ఉపయోగం కలుగుతుందని తెలిపారు. జీఎస్టీ స్లాబులు నాలుగు నుంచి రెండు మాత్రమే మిగిలాయని చెప్పారు. రాష్ట్రానికి ఏడాదికి రూ. 8,000 కోట్ల నష్టం వచ్చినా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా హస్తకళలు, నూలు రంగానికి జీరో శాతం జీఎస్టీ అమలు పెద్ద ఊరట అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News