ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలోని ఎయిర్‌బస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తో కలిసి ఎయిర్‌బస్ బోర్డుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎయిర్‌బస్ మొత్తం బోర్డు భారతదేశానికి వచ్చిన ఇదే మొదటి సందర్భం కావడంతో, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భారత్–ఎయిర్‌బస్ మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చ జరిగింది.
ముఖ్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ కంపోనెంట్ తయారీ, ఎమ్.ఆర్.ఓ (మెంటినెన్స్, రిపేర్, ఆపరేషన్స్), విమానయాన శిక్షణ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను పెంపొందించడం, ఎయిర్‌బస్ ఉనికిని విస్తరించడం ప్రధాన అంశాలుగా చర్చించారు.
ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం ద్వారా మరింత అవకాశాలను సృష్టిస్తామని తెలిపారు.
అలాగే, ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ” నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, బలమైన వ్యాపార వాతావరణం, ప్రోత్సాహకర విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది” అని వివరించారు.
Prajavartha Online Telugu News