గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రదానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా గుంటూరు నగరానికి మంజురైన ప్రతిష్టాత్మక మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎం.ఎస్.యూ.) ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఎం.ఎస్.యూ. ప్రతినిధులను కోరారు. శుక్రవారం స్థానిక మెడికల్ కాలేజిలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ఏర్పాటు పనులను పరిశీలనకు డిల్లీ నుండి వచ్చిన ఎం.ఎస్.యూ. బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అత్యున్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా గుంటూరు నగరంలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, సదరు యూనిట్ ఏర్పాటు పనులను వేగంగా జరిగేల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యూనిట్ పనుల పురోగతిపై పరిశీలనకు వచ్చిన ఎం.ఎస్.యూ. బృందం కూడా తాము చేపట్టాల్సిన సాంకేతిక పనులను వేగంగా చేపట్టాలని కోరారు. సమావేశంలో ఎం.ఎస్.యూ సంయుక్త డైరెక్టర్ డాక్టర్ ప్రణయ్ వర్మ, వై.శ్రీను, డాక్టర్ సత్యమ్ సిల్, జిఎంసి ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారయణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News