గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలన, పర్యవేక్షణకు వివిధ రంగాల నిష్ణాతులతో ఒక సంయుక్త కమిటి ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ప్రజల సౌకర్యార్ధం నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం మరింత ప్రణాళికాబద్దంగా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూజరిగేలా పర్యవేక్షణ చేయడానికి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, పారిశుధ్య రంగాల్లో నిష్ణాతులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కూడిన కమిటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కమిటి సభ్యులుగా రేట్ పేయర్స్ అసోసియేషన్ నుండి కూడా సభ్యులు ఉంటారని, వారి వివరాలు తమకు ఇవ్వాలని, మిగిలిన విభాగాల పేర్లు కూడా సేకరణ చేసి, పరిశీలన చేసిన అనంతరం నగరపాలక సంస్థ కౌన్సిల్ ల్లో చర్చించి, ఆమోదించి కమిటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రేట్ పేయర్స్ సభ్యులు తమ దృష్టికి తెచ్చిన అంశాలపై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, విష్ణు, వేణు, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, సదాశివరావు, రాఘవరావు, అంజిరెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News