Breaking News

పేర్ని నానీ.. రెడ్ లైన్ దాటేశావ్… ఇక వదిలిపెట్టం

-బందరు అభివృద్ధి చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు
-నాడు ఆర్యశ్యులను వేధించి.. నేడు ఆర్యవైశ్యుల రాగం సిగ్గుచేటు
-దశాబ్దాలుగా వ్యాపారం చేసుకునే మా కుటుంబంపై నిందలేస్తే ఊరుకునేది లేదు
-బందరు ప్రజలకు అన్యాయం చేయాలని చూసినా, అభివృద్ధి అడ్డుకున్నా చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని, కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక పేర్నినాని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ప్రజల్ని, వ్యాపారుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. తాను తప్ప మరెవరూ ఉండకూడదు అనేలా పేర్నినాని వ్యవహరిస్తున్నారు. మచిలీపట్నం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణరావుగారిని రాజకీయంగా సమాధి చేసేందుకు అతని కుమారుడికి కౌన్సిలర్ టికెట్ ఇప్పించి, అతనికి వ్యతిరేకంగా పావులు కదిపి ఓడించారు. 1999లో నడకుదిటి నరసింహరావు గారు మంత్రిగా ఉన్నపుడు అనేక రకాలుగా వేధించారు. తర్వాత నన్ను తప్పుడు కేసులో ఇరికించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు.

పేర్ని నాని 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా తండ్రి, తాత గారు 1950ల్లో కొనుక్కున్న వ్యవసాయ భూముల్ని అసైన్డ్ భూములు అని ప్రచారం చేసి కొట్టేయాలని ప్రయత్నిస్తే.. మేము తాడో పేడో అన్నట్లు పోరాడి సాధించుకున్నాం. 2014లో ఎన్నికలకు ముందు నాపై ఇన్ కం ట్యాక్స్ తో సోదాలు నిర్వహించి వేధించారు. మచిలీపట్నంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రైస్ మిల్స్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత మా కుటుంబానిది. మచిలీపట్నంలో అధునాతన రైస్ మిల్లులను ఏర్పాటు చేసిన ఘనత మా నాన్న గారిదే. మా మామగారు నడకుదిటి నరసింహరావు రాజకీయాల్లోకి రాక ముందే నవీన ఇంజనీరింగ్ వర్స్క్ కంపెనీ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారు.

పేదల భూముల్ని బలవంతంగా లాక్కోవడంలో పేర్ని నాని నిష్ణాతుడు. 1985లో మా అన్నయ్య పెళ్లికి తిరుపతి వెళ్తే.. పేర్ని కృష్ణమూర్తి గారు నాటి మున్సిపల్ ఛైర్మన్ బలగం పీతాంబరేశ్వరరావుకు చెందిన 440 గజాల భూమిని బలవంతంగా లాక్కున్నారు. 1997లో జిల్లా ఏడీజే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు రాగానే హైకోర్టుకు వెళ్లి వేధింపులకు పాల్పడ్డారు. కొనకళ్ల బుల్లయ్య గారు, నేను కలిసి భూములు కొట్టేశామని చెప్పడానికి పేర్నినాని సిగ్గుపడాలి. 2009లో అగ్రిమెంట్ చేసుకుంటే దానికి మోకాలడ్డి, 2016లో బుల్లయ్యగారు సెటిల్ చేయడంతో అప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని పేర్ని నానికి తెలియదా? నేను మంత్రిగా ఉన్నప్పటికీ.. చట్టబద్దంగానే నడచుకున్నాం తప్ప ఎక్కడా తప్పు చేయలేదు.

ఆర్య వైశ్యుల్ని బెదిరిస్తున్నామని, వేధిస్తున్నామని చెప్పడం పేర్ని నాని చెప్పడం హేయం. కులం, మతం ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయడంలో వైసీపీ నేతలది, పేర్ని నానిది అందెవేసిన చెయ్యి. నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆర్యవైశ్యులెవరికైనా అన్యాయం జరిగిందని పేర్ని నాని నిరూపించగలరా? జెల్లూరు గోపి తమ్ముడు శ్రీధర్, ఇతర సోదరులంతా కలిసి మార్కెట్ ధరకు అమ్ముకుంటే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. ఇండూరి బాపనయ్య అనే వ్యక్తి భూమిని ఎవరికో అమ్ముకున్నారు. దాన్ని కోర్టు పరిష్కరించిన విషయం కూడా తెలియని దిక్కుమాలిన స్థితిలో పేర్ని నాని ఉన్నాడు. మచిలీపట్నంలో కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలను కూడా నాకు అంటగట్టాలని చూస్తే చెప్పులు తెగేలా కొడతాం.

మిస్టర్ నానీ.. దమ్ముంటే రా. రాజకీయంగా బందరకు నువ్వేం చేశావో. నేనేం చేశానో తేల్చుకుందాం. అంతేగానీ.. పిచ్చి పిచ్చిగా వాగి ప్రజల మధ్య విభేధాలు సృష్టించాలనుకుంటే చెప్పులు తెగేలా కొడతాం. ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పుకునే పేర్ని నానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి.? ముడా భూముల్ని అక్రమంగా తవ్వేసి లక్షల ట్రిప్పుల మట్టి తరలించడం వాస్తవం కాదా. మంగలేరు వద్ద 7 ఎకరాల భూముల్ని లెవల్ చేయించుకున్నావ్. ఆ మట్టి ఎక్కడి నుండి తెచ్చావ్? మైనింగ్ పర్మిట్లున్నాయా? వాసవి వెంచర్ నీది కాదా. దాన్ని లెవల్ చేయడానికి ముడా బూములు తవ్వేయడం వాస్తవం కాదా.?

నాలా, ముడా నుండి ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాం. వాటికి అనుమతులు లేవని చెప్పడానికి సిగ్గుండాలి. 2005లో నవీన ఇండస్ట్రీస్ పేరుతో రైస్ మిల్ మిషనరీ తయారీ ప్లాంటును నా తండ్రి ఏర్పాటు చేశారు. అప్పుడు అన్ని అనుమతులు తీసుకున్నాం. ఇప్పుడూ అనుమతులు తీసుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.5 కోట్లు రుణం తీసుకుని నా కుమారుడు వ్యాపారం చేసుకుంటే తప్పా? కొత్త నిబంధనల ప్రకారం ఇచ్చిన డిమాండ్ మేరకే మా నిర్మాణాలు చేపడుతుంటే.. దాన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు.

బైపాస్ రోడ్డులో రూ.15 కోట్ల విలువ చేసే 3800 గజాల స్థలాన్ని 2023లో అమ్ముకున్నాం. బైపాస్ రోడ్డుకు అవతల ఎకరం 50 సెంట్ల స్థలాన్ని అమ్ముకున్నాం. విజయవాడలో కొన్ని ప్లాట్లు అమ్ముకున్నాం. మోనికా టవర్స్ పక్కన 1.26 ఎకరాలు మేము అమ్ముకుంటే.. ఆ స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి పేర్ని నాని కబ్జా చేశాడు. ఇది నిజమో కాదో పేర్ని నాని సమాధానం చెప్పాలి.

పేర్ని నానికి వయసు పెరిగే కొద్దీ.. ఇంగితం నషించిపోతున్నట్లుంది. బందరులోని రంగనాయకుల స్వామి దేవాలయానికి చెందిన భూముల్ని వేలం పెట్టించి, సిండికేట్ ఏర్పాటు చేసి కొనుగోలు చేసి, వాటిని మామయ్య, భార్య పేరుతో రాయించుకోవడం వాస్తవం కాదా? అందులో ఉన్న హైటెన్షన్ కేబుళ్లను కనీసం రూపాయి ఛలానా చెల్లించకుండా మళ్లించుకోవడం నిజం కాదా? రోడ్డు విస్తరణ విషయంలో హడావుడి చేస్తున్న పేర్ని నానిని అడుగుతున్నా.. 2006లో రోడ్డును కొట్టేసి, 2011లో 40 అడుగులకు విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది నీవు కాదా అని ప్రశ్నించారు.

సమస్య ఉందని ప్రజలు చెప్పినపుడు స్థానిక ఎమ్మెల్యేగా నేను, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి పరిష్కరిస్తాం. గతంలో మెడికల్ కాలేజీ పేరుతో చుట్టు పక్కల ఎర్రజెండాలు పాతిస్తే.. మేము పోరాడి రైతులకు న్యాయం చేయించాం.

ఆర్యవైశ్యులకు నీవు చేసిన ద్రోహం, దగా గురించి ప్రజలెవర్ని అడిగినా చెబుతారు. దినాల సత్రం భూముల్ని పేర్ని నాని కబ్జా చేయడం వాస్తవం కాదా? దాన్ని ప్రశ్నించినందుకు 80 ఏళ్ల వయసున్న గున్నయ్య శెట్టిపై అత్యాచారం కేసు పెట్టించావు. మెహర్ బాబా, మోటమర్రి బాబాప్రసాద్, మామిడి మురళీపై అత్యాచారం కేసులు పెట్టి వేధించిన నీవు కూడా ఆర్యవైశ్యుల గురించి మాట్లాడడమేనా? మాకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరైనా వచ్చి ఇప్పటి వరకు చెప్పడం చూశావా? గో సంఘం కోసం దాతలు ఇచ్చిన 25 ఎకరాల భూముల్ని కొట్టేసి, నీ మనుషలకు దోచిపెట్టడం వాస్తవం కాదా? జిల్లా పరిషత్ నుండి ఉన్న రోడ్డు విస్తరణ సమయంలో దౌర్జన్యంగా, బెదిరించి సంతకాలు పెట్టించావు. ఏ ఒక్కరికైనా పైసా ప్రయోజనం ఇచ్చావా? బట్టలకొట్టు గాంధీ షాపులో వ్యాపారం జరుగుతున్న సమయంలోనే జేసీబీలతో కొట్టించేశావ్. కృష్ణా మోడ్రన్ డ్రెస్ షాపు ముందు పెద్ద గుంత తవ్వి వేధించడం మరిచిపోయారనుకున్నావా? జందు రాజా గారెకి చెందిన మల్టీప్లెక్స్ వెనుక స్థలాన్ని బెదిరించి లాక్కోవడం వాస్తవం కాదా? డీ మార్ట్ పక్కనున్న వరం మాల్ కూడా రాయించుకుంటే.. కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రారంభించాం. కన్యకా పరమేశ్వరి కమిటీని వేధించి, ఆలయ ఆస్తుల్ని కబ్జా చేయడం నిజం కాదా?

మూడు స్తంభాల సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డును విస్తరించేందుకు అవసరం మేరకు అందరితోనూ చర్చలు జరుపుతున్నాం. నీలా యజమానుల్ని దగా చేయకుండా..ప్రతి ఒక్కరికీ నాలుగు రెట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తాం. షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా షాపులు కేటాయిస్తాం. బెల్లంకొట్ట సందులో వ్యాపారులతో చర్చలు జరిపిన తర్వాతే ముందుకు వెళ్తున్నాం

పదవుల కోసం ముడుపులు తీసుకున్నామని పేర్ని నాని మాట్లాడితే చెప్పులు తెగే వరకు కొడతాం. నీలా పదవులు అమ్ముకోవడం, తండ్రి ఉండగానే దరఖాస్తులు పెట్టడం, ఛైర్మన్‌గా కౌన్సిలర్ల మేండేట్లు చింపేసి దళితుడి ఓటమికి కారణం నీవు కాదా? డబ్బుకు పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదని పేర్ని నాని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కమిటీ ఆధ్వర్యంలో మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తామని తెలుసుకోవాలి. కార్యకర్తలు, నాయకులు డబ్బులు వసూల్ చేస్తున్నారని, మట్టి తవ్వుకుంటున్నారని పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకునేది లేదు.

వాలంటీర్లతో ఇళ్లు కట్టుకునే వారిని వేధించడం వాస్తవం కాదా. ఇంటికి చుట్టం వచ్చినా నిఘా పెట్టి అవస్థలపాలు చేయడం నిజం కాదా.? చేయాల్సిన పాపాలన్నీ చేసి.. నీతిగా ఉండే పార్టీపై నిందలేస్తే నాలుక చీలుస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా మచిలీపట్నం అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం. బందరు అభివృద్ధిని ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నాం. ఇప్పటికే బందరు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. కూటమిపై, కూటమ నాయకత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి పారిపోతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రోడ్లపై పట్టాలిస్తే తప్పేంటి అని చెప్పిన పేర్ని నాని ఇప్పుడు అదే మాట మాట్లాడగడా? బెల్లం కొట్టు సందులో మాది కూడా 110 గజాలు పోతోంది. ఆ విషయం పేర్నినానికి తెలియదా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *