Breaking News

మొంతా తుఫాన్ కారణంగా వచ్చే మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మొంతా తుఫాన్ కారణంగా వచ్చే మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మోంత తుఫాను సందర్భంగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానుకు వరదలకు చాలా తేడా ఉంది ఉందనే విషయం అధికారులందరూ గమనించాలన్నారు. వరదలకు కేవలం కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాలపై దృష్టి పెడతారన్నారు.
అదే తుఫాను వస్తే జిల్లా అంతా ప్రభావం చూపుతుందన్నారు. అన్ని గ్రామాల్లోనూ బీభత్సమైన వర్షం కురవడంతో పాటు తీవ్రమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు.

మోంత ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో తుఫాను హెచ్చరికలపై దండోరా వేయించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. జిల్లాకు చెడ్డ పేరు రాకుండా మండలాలు, మునిసిపాలిటీలలో సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, తహసిల్దారులు, ఎస్హెచ్ఓలు, మండల ప్రత్యేక అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా కూడా మనుషులు గాని, పశువులు గాని ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుత తుఫాను వలన గంటకు100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఆ గాలులకు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూలిపోతాయన్నారు. ముఖ్యంగా తాటాకు ఇల్లు, పూరిపాకలు, మట్టి ఇల్లు, పాతబడిన ఇళ్లు బలహీనంగా ఉన్న ఇల్లు పడిపోయే అవకాశం ఉందన్నారు. అటువంటి ఇల్లతో సహా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. లేనిపక్షంలో ప్రాణ నష్టం జరుగుతుందని, అలా జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని, అందుకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా సహాయక శిబిరాలను ఆదివారం గుర్తించాలని, ఏఏ ప్రాంత ప్రజలను అక్కడికి తరలించాలో కూడా జాబితా ముందుగానే సిద్ధం , చేసుకోవాలన్నారు.

సహాయక శిబిరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరైన విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీరు, నిత్యవసర సరుకులు, ఆహారం వండే వంట వాళ్ళు, దోమల బెడద లేకుండా మస్కిటో కాయిల్స్ తదితర సౌకర్యాలతో ఏర్పాటు చేయాలన్నారు.

అన్ని సహాయక శిబిరాల వద్ద తప్పనిసరిగా ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలను తిరిగి వారి ఇంటికి సురక్షితంగా చేర్చే బాధ్యత అధికారులు అందరిపై ఉందన్నారు. ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆదివారం రాత్రి నుండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని పనులు సజావుగా జరిగాయా లేదా అని మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో ప్రజలందరూ పవర్ బ్యాంకులు, మొబైల్లు ముందుగానే చార్జింగ్ చేసి పెట్టుకోవాలని, కొవ్వొత్తులు బ్యాటరీ లేదా ఎమర్జెన్సీ లైట్లు సిద్ధంగా ఉంచుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరూ రైన్ కోట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గాలివానకు ఎక్కడైనా చెట్లు పడిపోతే రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే వాటిని తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  ఏ ఒక్క మనిషి గాని పశువుల ప్రాణం గాని పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా రహదారులు గాని కాజ్వేలు గానీ దాటాలని కొందరు ప్రయత్నిస్తారని అక్కడ గండిపడి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అక్కడ బాధ్యులైన వారిని కాపలా ఉంచి రాకపోకలు నియంత్రించాలన్నారు. నివాస ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి పారిశుధ్యం సరిగా లేక దోమలు తదితర కీటకాలతో జబ్బులు వచ్చి మరణించే అవకాశం ఉందన్నారు. అటువంటివి జరగకుండా ముందుగానే పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగి బ్లీచింగ్, ఫినాయిల్ తదితర పారిశుధ్య ఏర్పాట్లు నిర్వహించాలన్నారు.

నిత్యావసర సరుకులు చౌక దుకాణాలకు ఆదివారం సాయంత్రం లోగా పూర్తిగా చేరవేయాలన్నారు. మంచినీరు ఎక్కడ కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడైనా నీరు కలుషితమైతే ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం అన్ని కాలువలలో నీటి ప్రవాహం లేదని ఎక్కడైనా పైపులు అడ్డుగా వేసి ఉంటే గస్తీ చేసి వాటిని తొలగించాలని సూచించారు. జల వనరులు, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది కలిసికట్టుగా ఈ పనులు చేయాల్సి ఉంటుందన్నారు.

గాలికి ఊగులాడుతున్న ఫ్లెక్సీ లు, పాత ఫ్లెక్సీలు ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలని రాకపోకల మార్గాల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే జాగ్రత్త వహించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తోడేందుకు కావలసిన యంత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్లో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, షారోన్ మండల ప్రత్యేక అధికారులు, ఎల్ డి వో లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *