మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మోంత తుఫానును సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మికులు, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం పంచాయతీ గిరిపురంలో మండల పరిషత్ పాఠశాల లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి ప్రజలతో అందరూ బాగున్నారా అని వారు విచారించారు. అనంతరం మంగినపూడి బీచ్ ను సందర్శించి అక్కడ ఎగిసిపడుతున్న అలలను, బలమైన ఈదురుగాలులను పరిశీలించారు.
అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోంత తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా పూర్తిగా ఏర్పాట్లు చేసిందన్నారు.
జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, ప్రమాదాలు ప్రాంతాల నుండి ప్రజలను తరలించేందుకు 222 సురక్షిత పునరావాస కేంద్రాలను గుర్తించామన్నారు. అందులో అవసరాన్ని బట్టి 162 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
అందులో ప్రస్తుతం ఉన్న 2,497 కుటుంబాలకు కావలసిన మంచినీరు, ఆహారము తదితర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
జిల్లాలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అందులో ఒకటి మచిలీపట్నం రెండవది గుడివాడలో ఉన్నాయన్నారు.
అలాగే నావికాదళం, సైనిక దళం సేవలను కూడా అవసరమైన పక్షంలో వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు తదితర అన్ని ప్రభుత్వ శాఖలు తుఫాను సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా అప్రమత్తంగా ఉన్నారన్నారు.
కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా మొబైల్ నెట్వర్క్ సంబంధించి అదనంగా జనరేటర్లు ఏర్పాటు చేసామన్నారు.
అలాగే అన్ని పునరావాస కేంద్రాల్లోనూ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు.
వాతావరణ శాఖ ప్రకటించిన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులందరికీ సెలవులు ప్రకటించామని వారితో పాటు ప్రజలందరూ కూడా బయటకు రాకుండా సురక్షితంగా వారి ఇండ్లలోనే జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సహకరించాలన్నారు.
మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారి తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందిందన్నారు. ఈరోజు రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్యలో మోంత తుఫాను తీరం దాటనుందన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా చేశామన్నారు.
జిల్లాలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తుఫాను రాబోతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరడం జరుగుతున్నదన్నారు.
రెవెన్యూ, పోలీసు తదితర అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లాకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయని ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కాపాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా వారి కోసం జిల్లాలో 200 పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, వారికి మంచినీరు, ఆహారము తదితర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
ప్రజలకు మంచినీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జనరేటర్ ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
మచిలీపట్నంలో ఈరోజు ఇప్పటివరకు 21 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. వర్షపాతం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈదురుగాలులు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు
సముద్రం ఉధృతంగా ఉందన్నారు.
చెట్లు, గోడలు పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ప్రాణ నష్టం జరగకుండా అక్కడి ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు.
నగరంలో మురికి కాలువలో పూడికలు తీయడంతో పాటు ఆక్రమణలు తొలగించడం వలన కొంత మేరకు వరద నీరు ప్రవాహం సజావుగా సాగుతుందన్నారు
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మోంత తుఫాను వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు.
ప్రమాదం జరిగే ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకునీ సహకరించాలన్నారు.
ఈ పర్యటనలో మంత్రులు వెంట మచిలీపట్నం డివిజన్ ఇంచార్జ్ గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, ఎంపీడీవో వెంకటేశు, తహసిల్దారు నాగభూషణం మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News