Breaking News

తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల చాలా నష్టాన్ని నివారించగలిగాం..

-ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ శాయశక్తులా కృషి చేశారు
-జిల్లాలో 46 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది..
-నష్టపోయిన ప్రతి ఒక్కరినీ కూటమి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది..
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్

అవనిగడ్డ,  నేటి పత్రిక ప్రజావార్త :
తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల చాలా నష్టాన్ని నివారించగలిగామని, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసి విపత్తును ఎదుర్కొన్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాస్త్రం శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మొంథా తుపాను నేపథ్యంలో గురువారం అవనిగడ్డ నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆయన అవనిగడ్డ మండలంలోని అవనిగడ్డ విద్యుత్ ఉపకేంద్రం ఆవరణలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన తుపాను ప్రభావ ఛాయాచిత్ర ప్రదర్శన పరిశీలిన అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముందుచూపుతో అధికారులను అన్ని విధాలుగా అప్రమత్తం చేసి తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. అధికారులందరూ శాయశక్తులా కృషి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టారని, లంక గ్రామాలలో రిస్కు తీసుకుని ప్రజలను విపత్తుల నుంచి కాపాడారని అభినందించారు.

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని అభినందించారు. లోతట్టు ప్రాంతాలలోని దాదాపు 23,744 మంది ప్రజలను ఏర్పాటు చేసిన 240 సహాయక శిబిరాలకు తరలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారన్నారు.

జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 46,357 హెక్టార్లలో వ్యవసాయ పంటకు నష్టం వాటిల్లిందని, దీనివల్ల 56వేల మందికి పైగా రైతులపై ప్రభావం చూపిందన్నారు. అదేవిధంగా 1,416 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, 2,229 మంది రైతులు నష్టపోయారన్నారు. కౌలు రైతులు ఎక్కువగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన పంట నష్ట అంచన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ఇళ్లు 39, పాక్షికంగా 489 ఇళ్లు కలిపి మొత్తం 528 ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలో తేలిందన్నారు. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున తప్పకుండా సాయం అందించి ఆదుకుంటామన్నారు. చెట్టు విరిగి మీద పడి మరణించిన కోయ సుబ్బారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

తుపాను నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారునికి 25 కేజీల బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె ఒక్కొక్క కేజీ చొప్పున నిత్యావసర సరుకులు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. అదేవిధంగా తుపాను వలన ఉపాది కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె ఒక్కొక్క కేజీ చొప్పున నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తుపాను ప్రభావం వలన సహాయక శిబిరాలలో ఉన్న ప్రతి కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేలు, ఒక వ్యక్తికి రూ.వెయ్యి ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరిగేషన్ మురుగు కాలువలకు సంబంధించిన పూడికతీత పనులు సక్రమంగా చేపట్టడం వల్ల తుపాను నష్టం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సముద్రపు నీరు పొలాల మీదకు రాకుండా పాడైపోయిన పాత వంతెన స్థానంలో కొత్త అవుట్ ఫాల్ సూయిజ్ వంతెన నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం నాబార్డ్ ఇతర నిధులు సమీకరించి దివిసీమ ప్రాంతంలోని ప్రధాన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తుపాను ముగిసిన అనంతరం పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని, ఆయా జిల్లాల్లో 274 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆయా గ్రామాలలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు దాదాపు 21,055 మంది సిబ్బందిని వినియోగించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారుచేసిన అనంతరం అవసరం మేరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరతామన్నారు.

సమావేశంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మొంథా తుపాను జిల్లా ప్రత్యేక అధికారి కాట ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుడు మండలి బుద్ద ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, యువ నాయకుడు మండలి వెంకట్రామ్, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *