మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పనే దైవం అనుకుంటే చాలు ఆలోచనలు, అవకాశాలు వెతుక్కొంటూ అవే వస్తాయిని, చేసే ఏ పనైనా దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) అన్నారు.
మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
స్థానిక సుందరయ్యనగర్ ( గోపాల్ నగర్ ) కు చెందిన యామిని శాంతమ్మ మంత్రి వద్ద తన కష్టాన్ని చెప్పుకొంది. తనకు ఇళ్లస్థలం వచ్చిందని అయితే , జీ ప్లస్ 3 గతంలో మంజూరైందని అది వచ్చే అవకాశం ఉంటే ఇప్పించండని అడిగింది. రెక్కల కష్టం తప్ప తనకేమీ లేదని పాచిపనులు చేసుకొనే తనకు నిలువనీడ ఏర్పరచమని ఆమె అభ్యర్ధించింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇంకా మీకు ఆ ఫ్లాట్ ఇవ్వక పోవడానికి కారణం ఏమి చెప్పారని ఆమెను ప్రశ్నించారు. ఫ్లాట్ రాలేదని , స్థలం వచ్చిందని అధికారులు చెబుతున్నారని జవాబు ఇచ్చింది. అమ్మా మీ రెక్కల కష్టం గొప్పదని గౌరవ ప్రదమైన సంపాదన ముఖ్యమని ఆమెతో మంత్రి అన్నారు. 4,176 మంది వద్ద పాత ప్రభుత్వం డబ్బులు కట్టించుకొంది. కానీ, ఆ నిర్మాణాల నిమిత్తం 2, 304 మంది కోసమే పునాదులు తవ్విందని చెప్పారు. అలాగే, ఆ జి ప్లస్ 3 ఇల్లు తీసుకొంటే, యాభై వేలు లేదా లక్ష రూపాయలు ముందుగా డబ్బులు చెల్లించడమే కాకుండా ఇరవై ఏళ్ళ పాటు నెలకు రెండు వేల రూపాయలు కట్టే విధానంలో లబ్ధిదారులను ఇరికించివేశారని ఒక అద్దె ఇంటిలో నుండి మరో అద్దె ఇంటి లోనికి వెళ్లినట్లు మాత్రమే ఉందని ఏ ఒక్కరికి స్వంత ఇంటి అనుభూతి మిగలలేదనన్నారు. కానీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారంలోనికి వచ్చిన తరువాత లబ్ధిదారుని పేరిట స్వంతంగా రిజిస్ట్రర్ చేసిన స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు తిరిగి చెల్లించనవసరం లేని 1 లక్షా 80 వేల రూపాయలు డబ్బు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బు సరిపోకపోతే, పావలా వడ్డీకే డ్వాక్రా గ్రూప్ నుండి మరికొంత మొత్తాన్ని ఇస్తానని పదేళ్ల తర్వాత ఆ స్థలాన్ని కావాలంటే ఆ స్థలాన్ని విక్రయించుకోవచ్చు లేదా తనఖా పెట్టుకొనేలా వెసులుబాటు కల్పించిన మనసున్న ముఖ్యమంత్రి ఆయనేనని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందే 2,304 జీ ప్లస్ 3 ఫ్లాట్లకు ముందే లాటరీ తీసేరని వాటికి మాత్రమే గోతులు తీసి ఇనుపచువ్వలు పాతి కాగితాల మీద ఇదిగో మీ ఫ్లాట్ అంటూ ఇచ్చేరన్నారు. మిగిలిన ఖాళీ స్థలాలలో ఇళ్ల నిర్మాణమే మొదలు పెట్టలేదన్నారు.
స్థానిక ఈడేపల్లి నారాయణపురం ప్రాంతానికి చెందిన ఒక తల్లి మంత్రి పేర్ని నానిను కలిసింది.విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని దివ్యానంగుడైన తన పిల్లవాడు కోసూరు దుర్గా అయ్యప్ప పింఛన్ నిలిచిపోయిందని ఆ పింఛన్ తిరిగి తన బిడ్డకు వచ్చేలా సహాయం చేయాలనీ అభ్యర్ధించింది.
మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అనపర్తి చిన్నమ్మ అనే మహిళ మంత్రికి ఉదర సంబంధమైన తన అనారోగ్య సమస్య చెప్పుకొంది. రక్తం తగినంత లేకపోవడంతో శస్త్ర చికిత్స వాయిదా పడిందని తెలిపింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతానికి చెందిన ఎం.డి. జెక్కి మంత్రిని కలిసేందుకు వచ్చారు. తన భార్య గతంలో ఎం పి టీ సి సభ్యురాలిగా పనిచేసిందని ఇప్పుడు ఆమెకు పశ్చిమ గోదావరి జిల్లా కో – ఆప్షన్ మెంబెర్ గా పదవి ఇప్పించాలని అభ్యర్ధించారు
Prajavartha Online Telugu News