-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం పట్టణంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలను మాజీ మంత్రి, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారి క్రీడా నైపుణ్యాన్ని ప్రశంసించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన జట్లను అభినందిస్తూ, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలు పెంపొందుతాయని నెట్టెం రఘురాం పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో ముందుకు రావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభ సూచకమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మైలవరంలో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ యావత్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొంటూ, ఇలాంటి పోటీలు యువతను క్రీడల వైపు మరింత ప్రోత్సహిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాదాత లకిరెడ్డి హనిమిరెడ్డి, లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎన్డీఏ కూటమి నేతలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
Prajavartha Online Telugu News