ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రామాభివృద్ధికి కేడీసీసీ బ్యాంక్ అండగా నిలుస్తుంది

–మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం, శ్రీరాంపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశంతో, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే సంకల్పంతో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం శ్రీరాంపురం గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంలో రూ.32 లక్షలతో ప్రారంభమై, మొత్తం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక సహకార సొసైటీ భవనానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తో కలిసి సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా 26 మంది రైతులకు రూ.2.16 కోట్ల విలువైన వ్యవసాయ రుణాలను పంపిణీ చేశారు.

నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం కింద మంజూరయ్యే సోలార్ యూనిట్ల రుణాలను రైతులు, గ్రామస్తులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సోలార్ శక్తి వినియోగంతో విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తోందని వివరించారు. 2 కిలోవాట్స్ మరియు 3 కిలోవాట్స్ సోలార్ యూనిట్లకు మొత్తం వ్యయం రూ.2,30,000 వరకు ఉండగా, దానిపై రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకానికి కేడీసీసీ బ్యాంక్ ద్వారా సులభమైన రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉందని, కాబట్టి ప్రజలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవచ్చని అన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు డ్రోన్ల వినియోగానికి కూడా ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఐదుగురు కలిసి ఒక బృందంగా ఏర్పడి రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్ యూనిట్‌ను కొనుగోలు చేస్తే, దానిపై 80 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ డ్రోన్ల కొనుగోలుకు కూడా కేడీసీసీ బ్యాంకు ద్వారా రుణ సదుపాయం అందించబడుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, గ్రామీణాభివృద్ధి, రైతుల ఆర్థిక పురోగతి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని, ప్రభుత్వ సహకారం పూర్తిగా అందుబాటులో ఉందని నెట్టెం రఘురాం కోరారు.

ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వ్యాఖ్యలు
ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ, సొసైటీ భవన నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన నెట్టెం రఘురాం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ  మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీరాంపురం గ్రామం క్రమశిక్షణ, ప్రజల ఐక్యత మరియు పట్టుదల గల నాయకత్వంతో ముందుకు సాగుతుందని, ఈ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు.

పండుగ వాతావరణంలో కార్యక్రమం
శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది. తొలుత రామాలయంలో స్వామివారి దర్శనంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాట నృత్యాలతో కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు. అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్థలదాతలకు ప్రత్యేక ప్రశంసలు
గ్రామాభివృద్ధికి తమ భూములను అందించిన పంచాయతీ భవన స్థలదాతలు నాదెళ్ల చెన్నకేశవరావు, సర్పంచి అట్లూరి శ్రీనివాసరావు, అలాగే పి.ఏ.సి.ఎస్ స్థలదాతలు వెంకట కృష్ణారావు, చంద్రశేఖర్‌లను నెట్టెం రఘురాం ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *