– ఇంకా పంపిణీ కానీ 29,107 రేషన్ కార్డులు
– జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రేషన్ కార్డు దారులు నవంబరు నెలాఖరులోగా తమ స్మార్ట్ రేషన్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ప్రభుత్వం పాత రేషన్ కార్డులను స్థానంలోకి తీసుకు వస్తూ, జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులు ముద్రించి పంపిణీకి పంపిందని చెప్పారు. ఆగస్టు 25వ తేది నుండి సచివాలయ సిబ్బంది మరియు రేషన్ షాపు డీలర్ల ద్వారా పంపిణీ ప్రారంభించగా, ఇప్పటి వరకు 5,30,241 కార్డుదారులకు కార్డులు అందజేయడం జరిగిందని తెలిపారు. అయితే కొంతమంది ఇతర ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లడం, తమ కార్డులు ఏ సచివాలయంలో ఉన్నాయో తెలియకపోవడం వంటి కారణాలతో 29,107 కార్డులు ఇప్పటికీ పంపిణీ కాకుండా సంబంధిత సచివాలయాలలో మిగిలి ఉన్నాయని వివరించారు. అందువల్ల స్మార్ట్ కార్డు పంపిణీ గడువును నవంబర్ చివరి వరకు పొడిగించామని తెలిపారు. కార్డు పొందని వారు తమ సమీప సచివాలయాన్ని సంప్రదించి, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు వేలిముద్ర లేదా OTP ధృవీకరణ ద్వారా వెంటనే స్మార్ట్ రేషన్ కార్డు పొందాలని సూచించారు. జిల్లాలోని రేషన్ కార్డులలో మొత్తం 15,85,090 మంది సభ్యులు ఉండగా, వారిలో 57,022 మంది ఇప్పటికీ EKYC చేయించుకోవాల్సి ఉన్నదని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇంకా EKYC చేయించని సభ్యులు దగ్గరలోని రేషన్ షాపులో ఉన్న ePOS యంత్రం ద్వారా EKYC వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News