గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా మైనింగ్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక సరఫరాపై ఐవిఆర్ఎస్ ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పర్సెప్షన్ లో సంతృప్తి స్థాయి మరింత మెరుగుపరిచేలా మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి లింగాయపాలెం వరకు కృష్ణా నదిలో నావిగేషన్ ఛానల్ – 4లో ఇసుక తవ్వకాలకు ఎన్వోసీ జారీ చేసినందున నిర్దేశిత మార్గదర్శక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల సామర్థ్యం మేరకు అనుమతించిన టన్నుల వరకు మాత్రమే ఇసుకను సరఫరా చేసేలా వాహనాల యజమానులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా మైనింగ్ జియాలజికల్ అధికారి చంద్రశేఖర్, జిల్లా భూగర్భ జల వనరుల శాఖ ఉపసంచాలకులు వందనం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీమా బేగం, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, తెనాలి ఆర్టీవో శ్రీహరి, తహశీల్దార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News