మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగాన్ని ముందుచూపుతో పటిష్టంగా రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని, వారిని స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందుచూపుతో ఆ సమయంలో తన ముందుకు వచ్చిన కొన్ని అంశాల ఆధారంగా భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా రూపొందించారన్నారు. అందుకే దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వం నిరంతరం కొనసాగుతున్నదన్నారు. దేశంలో ఏ ఒక్క వ్యవస్థ నియంతలా వ్యవహరించకుండా అవసరమైన విభాగాలు, విలువలను రాజ్యాంగం లో పొందుపరిచారన్నారు. ఏ ఒక్కరు వారికున్న అధికారాన్ని ఎక్కడ ఎక్కువగా వాడాలన్నా హద్దు మీరుతున్నా కూడా ఇంకొక సంస్థ రక్షించే అధికారం ఉందన్నారు.
సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల వారికి వెసులుబాటు కల్పించారన్నారు. దేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలైనా చాలా పటిష్టంగా ఉండి ముందుకు దూసుకెళ్తోందన్నారు. అంబేద్కర్ను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో వారు చూపిన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కలెక్టరేట్ ఏవో రాధిక, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News