గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు లో జరగనున్న సరస్ ఎగ్జిబిషన్ 2026 ను విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సరస్ ప్రదర్శన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సరస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society) ఎగ్జిబిషన్ 2026 ను గుంటూరు కాకాని రోడ్ లోని లీఫ్ టుబాకో ట్రషింగ్ స్థలంలో 03 జనవరి 2026 నుండి 15జనవరి 2026 వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, వారి ఆదాయ వనరులు పెంపొందించడం మరియు గ్రామీణ మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశ్యం అని వివరించారు. ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు అనేక రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొంటున్నారని చెప్పారు. మొత్తం 250 స్టాళ్లలో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, టెడ్షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సాంప్రదాయ మరియు ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పండుగల కాలంలో అధిక ప్రజల రాకపోకలు, మెరుగైన రవాణా సౌకర్యాలు మరియు మార్కెటింగ్ అవకాశాల నేపథ్యంలో గుంటూరు నగరాన్ని వేదికగా ఎంపిక చేయబడిందన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే స్థలంలో పారిశుధ్యం ఇతర అవసరమైన మౌలిక సౌకర్యాలు నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రత, నిఘా, అగ్నిమాపక సౌకర్యాలు, వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్ మరియు జనరేటర్ ఏర్పాట్లు సంబంధిత శాఖలు పర్యవేక్షించాలన్నారు. ఎగ్జిబిషన్లో ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణకు పర్యాటక శాఖ, విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి స్టాల్స్ ఏర్పాటు కోసం వచ్చే స్వయం సహాయక సంఘాల సభ్యులకు అనువైన వసతి కేంద్రాలను డిఆర్డిఏ, మెప్మా అధికారులు గుర్తించి ప్రతిపాదన అందించాలన్నారు. ఎగ్జిబిషన్ కి సంబంధించి గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించేలా పంచాయతీ , పురపాలక శాఖలు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు సంబంధించి ప్రసిద్ధ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, మెప్మా పీడి విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, జిల్లా పర్యాటక శఖ అధికారి రమ్య, ఎల్డిఎం మహిపాల్ రెడ్డి, నాబార్డ్ డిడీఎం శరత్ కుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News