-విశాఖ ఉత్సవ్‌లో హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
-ఆకాశం నుంచి విశాఖ అందాలను తిలకించే అద్భుత అవకాశం అంటూ ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్
-విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపిన మంత్రి దుర్గేష్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్‌లో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌ను రుషికొండ బీచ్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ తదితరులు హెలికాప్టర్లో ప్రయాణించి విశాఖ నగర సౌందర్యాన్ని ఆకాశం నుండి వీక్షించారు. ఈ సందర్భంగా విహంగ్ అడ్వెంచర్స్ అండ్ సూర్య ఏవియేషన్ సీఈవో కెప్టెన్ సూర్య హెలికాఫ్టర్ యజమాని సూర్య రైడ్ వివరాలు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్ భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిందని, దీనిని మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. “సిటీ ఆఫ్ డెస్టినీ” విశాఖపట్నం ప్రకృతి సిద్ధమైన సముద్ర తీరం, కొండలతో అలరారుతుంటుందని.. ఈ అందాలను ఆకాశ వీధుల నుంచి చూసి తరించడానికి హెలికాప్టర్ రైడ్ ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. విశాఖ ఉత్సవ్‌కు విచ్చేసే సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. వీటితో పాటు పారామోటరింగ్, స్కూబా డైవింగ్, పారా సెయిలింగ్, కయాకింగ్ తదితర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, విహంగ్ అడ్వెంచర్స్ అండ్ సూర్య ఏవియేషన్ సీఈవో కెప్టెన్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News