Breaking News

ఉద్యోగులకు ఆర్థిక అంశాలపై ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి – ఎస్.టి.యు

-రాష్ట్ర వ్యాప్తంగా తహసిల్దార్‌లకు ఎస్‌టియు ఆధ్వర్యంలో వినతి పత్రాల సమర్పణ

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల తహసిల్దారులకు ఎస్‌టియు ఆధ్వర్యంలో ఈ రోజు ది.30-01-2026న వినతి పత్రాలు సమర్పించినట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర., (ఎస్.టి.యు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ తెలిపారు. ఎస్.టి.యు, ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నందలి మండల తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు వేముల బిక్షమయ్య, స్టేట్ కౌన్సిలర్లు కొడాలి కిషోర్, ఎస్.మస్తాన్‌రావు, మరియు విజయవాడ నగర శాఖ నాలుగు మండలాల బాధ్యులు, పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ పిఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఆందోళన ఉంది. అలాగే పిఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న సందర్భంలో 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించవలసిన బకాయిలు కొండలా పేరుకు పోతున్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యుటీ, ఈ.ఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు 2024 నుండి పెండింగ్‌లో ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చాలా సంవత్సరాలుగా కోరుతున్నప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు మెమో 57 అమలు చేయాలని కోరుతున్నప్పటికీ పదేపదే వివరాలు సేకరిస్తున్నారు తప్ప నిర్ణయం తీసుకోవడం లేదు. 2024 జూలై నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన నాలుగు విడతల డిఏలు వెంటనే చెల్లించవలసి ఉన్నది. పి.ఆర్.సి కమిటీ ఏర్పాటు, ఐ.ఆర్ మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు తదితర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేనట్లయితే ఎస్‌టియు ఉద్యమ కార్యాచరణను ఉదృతం చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *