Breaking News

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరినిచ్చిన కేంద్ర బడ్జెట్

-బడ్జెట్–2026 పేదలు, మహిళలు, యువత అభివృద్ధికి దిశానిర్దేశం
-ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 దేశ పేదలు, మహిళలు, యువత అభివృద్ధిని కేంద్రబిందువుగా ఉంచిన సమగ్ర, సమతుల్య బడ్జెట్ అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. అభివృద్ధి–సంక్షేమాల మధ్య సరైన సమన్వయంతో రూపొందిన ఈ బడ్జెట్ దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ బడ్జెట్ ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించడం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపార రంగంలో ఎదగాలన్న దూరదృష్టికి ఈ బడ్జెట్ బలాన్నిస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది దోహదపడుతుందన్నారు. అలాగే చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) పెద్దపీట వేయడం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ముఖ్యంగా బయో ఫార్మా, అర్ధవాహక చిప్ తయారీ, కంటైనర్ తయారీ, వస్త్ర యంత్రాల తయారీ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం దేశీయ పరిశ్రమలను బలపరచడంతో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్–2026 ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఆశాజనక దిశను చూపిందని గద్దె అనురాధ అన్నారు. క్రిటికల్ మినరల్స్ కారిడార్, హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యాటక రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గేమ్‌చేంజర్‌లుగా మారనున్నాయని స్పష్టం చేశారు. రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయించడం ద్వారా రోడ్లు, రైల్వేలు, హై-స్పీడ్ కారిడార్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం వేగవంతమవుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కూడా కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. Infrastructure Risk Guarantee Fund, SWAMIH Fund–2, కంటైనర్ తయారీ పథకాలు నిర్మాణ–మౌలిక రంగాలకు కొత్త ఉత్సాహం ఇవ్వనున్నాయని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపెట్టాయని, దాని ప్రభావంతో యువత నిరుద్యోగంలోకి నెట్టబడిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కేంద్రం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే దూరదృష్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే ఉందని స్పష్టం చేశారు.
“నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, సాంకేతికంగా అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్రాభివృద్ధికి సమర్థంగా మలచగలిగే సామర్థ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉంది” అని గద్దె అనురాధ అన్నారు. ఈ ప్రజాహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *