-ఎస్.వో.ఎ.ఆర్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 18 వేల మందికి పైగా నమోదు
-కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి
-కృత్రిమ మేధస్సు (AI) సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంపై ప్రశ్నించిన ఎంపీలు కేశినేని శివనాథ్, బి.కె. పార్థసారథి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి (Skilling for AI Readiness (SOAR)) కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) నైపుణ్యాల్లో 2,18,046 మంది యువత శిక్షణకు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమానికి గణనీయమైన స్పందన లభించింది. ఏపీలో మాత్రమే 18,115 మంది యువత ఎస్.వో.ఎ.ఆర్ లో నమోదు చేసుకోగా, వీరిలో 2,356 మంది ఇప్పటికే విజయవంతంగా సర్టిఫికేషన్ పొందారని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి
వెల్లడించారు..
లోక్ సభలో సోమవారం ఎంపీలు కేశినేని శివనాథ్, బి.కె. పార్థసారథి కృత్రిమ మేధస్సు (AI) సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంపై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
కృత్రిమ మేధస్సు రంగంలో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఎ.ఐ ఫర్ ఎడ్యుకేటర్స్ (AI for Educators) కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 37,889 మంది ఉపాధ్యాయులు నమోదు కాగా, 3,463 మంది సర్టిఫికేట్ పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 2,953 మంది ఉపాధ్యాయులు నమోదు కాగా, 265 మంది సర్టిఫికేషన్ పొందారని వివరించారు.
ఎస్.వో.ఎ.ఆర్ (SOAR) కార్యక్రమంలో NCVET గుర్తింపు పొందిన Microsoft, HCL Tech, NASSCOM సంస్థలు శిక్షణ భాగస్వాములుగా వ్యవహరిస్తూ AI to be Aware, AI to Acquire, AI to Aspire, AI for Educators అనే నాలుగు కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించిన అర్హతలు, శిక్షణ వ్యవధి, పాఠ్యాంశాల వివరాలు జాతీయ అర్హతల రిజిస్టర్ (NQR)లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ది నేషన్ ఛాలెంజ్ (Skill the Nation Challenge) కార్యక్రమాన్ని 2026 జనవరి 1న ప్రారంభించిందని, దాని ద్వారా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం లభించిందని మంత్రి తెలిపారు. అదనంగా స్కిల్ ఇండియా డిజిటల్ హబ్( Skill India Digital Hub), సోషల్ మీడియా, జాతీయ మరియు ప్రాంతీయ మీడియా, అలాగే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్లు, ITIs, పాఠశాలల సహకారంతో గ్రామీణ ప్రాంతాల వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లినట్లు కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి చెప్పారు.
Prajavartha Online Telugu News