అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు.ఈనెల 11వ తేది బుధవారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తొలిరోజు అనగా బుధవారం ఉదయం 10 గం.లకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.ఈసమావేశాలు ఈనెల 11 నుండి మొదలై మార్చి 12వ తేది వరకు జరిగే అవకాశం ఉంది.రానున్న సమావేశాల నిర్వహణపై మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని ఆదేశించారు.సభ్యులు అడిగిన ప్రశ్నలకు నెల రోజులైనా సమాధానాలు రాకపోడవం చూస్తున్నామని ఇకపై అలా జరగకుండా సకాలంలో సమాధానాలు పంపేలా చూడాలని కార్యదర్శులను స్పీకర్ ఆదేశించారు.
వచ్చే వర్షాకాల అంసబ్లీ సమావేశాలను నేషనల్ ఇ-విధాన్ కింద డిజిటల్ విధానంలో సభ నిర్వహణకు కృషి జరుగుతోందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఈబడ్జెట్ సమావేశాల అనంతరం మొదలుపెట్టు వచ్చే వర్షాకాల సమావేశాల నుండి అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రశ్నల అవర్,జీరో అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలను నమోదు చేసుకుని వాటికి సకాలంలో సమాధానాలు పంపేందుకు వీలుగా ప్రతి శాఖ నుండి ఒక నోడలు అధికారిని నియమించడం జరిగిందని వివరించారు.అసెంబ్లీకి సంబంధించి 283 ప్రశ్నలకు,శాసన మండలికి సంబంధించి 562 ప్రశ్నలకు ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల నుండి సమాధానాలు పంపాల్సి ఉందన్నారు. దీనిపై వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు తక్షణ చర్యలు తీసుకుని అసెంబ్లీకి సమాధానాలు పంపాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.సభలో సభ్యులు అడిగే ప్రశ్నలను మానిటర్ చేసేందుకు వీలుగా జిఏడిలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను కూడా సిద్ధం చేశామని ఆపోర్టల్ ద్వారా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి సకాలంలో సమాధానాలు పంపేందుకు కృషి చేయడం జరిగుతుందని పేర్కొన్నారు.
ఈసమావేశంలో ఉప సభాపతి కె.రఘ రామకృష్ణ రాజు మాట్లాడుతూ సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖలు సకాలంలో సమాధానాలు పంపితే వాటిని సభ్యులు చదివి సన్నద్ధంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని కావున సకాలంలో సమాధానాలు పంపాలని కార్యదర్శులకు విజ్ణప్తి చేశారు.
అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్న కుమార్ ముందుగా మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారం రోజులు లోగా సంబంధిత శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని చెప్పారు.కాని సమాధానాలను చాలా ఆలస్యంగా పంపిస్తున్నారని ఇకపై సకాలంలో పంపేందుకు కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.నేషనల్ ఇ విధాన్ కింద త్వరలో డిజిటల్ విధానంలో సభను నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణ బాబు,ఎస్ ఎస్ రావత్,ఆర్పి సిసోడియా,ఎక్స్ అఫిషియో స్పెషల్ సిఎస్ బి.రాజశేఖర్,పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News