Breaking News

ప్రాథమిక స్థాయిలోనే ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కలు రావాలి

-తరగతి గదిలో పిల్లలతో కలెక్టర్
-గ్రేడింగ్ విధానంపై ప్రత్యేక దృష్టి
– కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జి.ఎఫ్.ఎల్.ఎన్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం కంబాలపేటలోని చున్నీలాల్ జాజూ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యాశాఖ అధికారులతో కలిసి జి.ఎఫ్.ఎల్.ఎన్ అమలు తీరును పరిశీలించారు. వందశాతం మంది పిల్లలకు ప్రాథమిక దశలోనే తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, గణితంలో చిన్నపాటి లెక్కలు చేయడం వంటి బేసిక్స్ తప్పనిసరిగా రావాలని స్పష్టం చేశారు. 1వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిని ప్రత్యక్షంగా పరీక్షించారు. ఒక విద్యార్థిని చక్కగా రైమ్ చదవడంతో అభినందించారు. లీప్ యాప్‌ను స్వయంగా ఓపెన్ చేసి విద్యార్థుల ప్రగతిని పరిశీలించడంతో పాటు, పాఠ్యపుస్తకంలోని పదాలతో పాటు మొబైల్‌లో తెరిచిన ఇతర పదాలను కూడా చదివించి వారి స్పందనను అంచనా వేశారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనులని ప్రధానోపాధ్యాయులు గోపి అప్పారావు తెలియజేయగా, తక్షణమే స్పందించి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కి ఫోన్ చేసి అవసరమైన వైద్య సహాయం అందించాలంటూ ఆదేశించారు. గ్రేడింగ్ విధానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని ఆధారంగా తీసుకుని అంచనాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జి.ఎఫ్.ఎల్.ఎన్) కార్యక్రమం ద్వారా ప్రాథమిక తరగతుల విద్యార్థులలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం మరియు గణితంలో ప్రాథమిక లెక్కలు చేయగల సామర్థ్యాన్ని నిర్ధారించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పునాది దశలోనే భాషా నైపుణ్యాలు మరియు సంఖ్యాజ్ఞానం బలోపేతం చేసుకునేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌లు, దినచర్యా ఆధారిత బోధన విధానాలు, లెర్నింగ్ అవుట్‌కమ్‌ల ఆధారిత అంచనాలు అమలు చేస్తారు. ప్రతి విద్యార్థి కనీస అభ్యాస ప్రమాణాలను తప్పనిసరిగా సాధించేలా నిరంతర మూల్యాంకనం, రిమీడియల్ టీచింగ్, సాంకేతిక వనరుల వినియోగం ద్వారా అభ్యాస లోటును తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు మాట్లాడుతూ 1-2 తరగతులు మరియు 3-5 తరగతుల విద్యార్థులకు వేర్వేరు యాక్షన్ ప్లాన్‌లు రూపొందించి డిసెంబర్ 8 నుండి మార్చి 24 వరకు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఎస్. సుభాషిణి, గౌరీ శంకరరావు, అర్బన్ రేంజ్ డీఐబీ దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయులు గోపి అప్పారావు, ఉపాధ్యాయులు వి. మౌళిక, ఎస్. సోమశేఖర్, సి.హెచ్.ఎల్.ఎన్. పద్మావతి, కె. వనజాక్షి, ఎ. ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *