రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరాలు తెలియ చేస్తూ, 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నద్ధత, శిక్షణా కార్యక్రమాలు, మాస్టర్ ట్రైనర్స్ మరియు ఫీల్డ్ ట్రైనర్ల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ రిజిష్ట్రార్ జనరల్, Registrar General of India కార్యాలయానికి చెందిన డా. వివిఎల్ఎన్ శర్మ మాట్లాడుతూ, Census of India–2027 దేశంలో 16వది, స్వాతంత్ర్యం తరువాత 8వ జనాభా గణన అని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ (HLO), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (PE) గా ఉంటుందని వివరించారు. ఈసారి మొట్ట మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ప్రత్యేకత అని తెలిపారు. వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ చేసుకునే అవకాశమూ కల్పించబడుతుందని వెల్లడించారు. జనాభా గణన ద్వారా సేకరించే డేటా ప్రణాళిక, విధాన రూపకల్పన, వనరుల కేటాయింపు మరియు సమాజ అవసరాల అంచనాకు అత్యంత కీలకమని పేర్కొనడం జరిగిందన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమర్థవంతమైన శిక్షణ, ఖచ్చితమైన డేటా సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జనాభా లెక్కల సేకరణ విజయవంతం కావడం క్షేత్ర స్థాయిలో జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల ఆధ్వర్యంలో అధికారుల , సిబ్బంది అంకితభావం, సమన్వయంపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర నోడల్ అధికారి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణకు నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్ పోర్టల్ సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ జె. నివాస్ మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్న ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News