-అమ్మకపు, కొనుగోలు దారులకు సి.ఇ.ఓ రామారావు సూచన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయం లేనిదే భారత దేశం ముందుకు సాగదు. అందుకే రైతు సంక్షేమంగా ఉంటే మానవాళి అందరూ క్షేమంగా ఉంటారని రైతు సాధికార సంస్థ కార్యనిర్వహణ అధికారి రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏ.పీ.సీఎన్‌ఎఫ్) కార్యక్రమంలో భాగంగా రైతు సాధికార సంస్థ (RySS) ఆధ్వర్యంలో గుంటూరులో ‘కొనుగోలుదారులు మరియు విక్రేతల అవగాహన’ కార్యక్రమాన్ని గుంటూరు లోని ఎన్.జి.ఓ కళ్యాణ మండపంలో శనివారం గుంటూరు డి పి యం రాజకుమారి అద్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ రసాయన వ్యవసాయం వల్ల వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడుతున్నాయని, వాటిని అధిగమించాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారని, అలాగే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా 6 లక్షల 25 వేల మంది రైతులు కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని 25 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, ఇండోనేషియా, జాంబియా దేశాల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారని తెలిపారు. పంట కోత అనంతర యాజమాన్య పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబులింగ్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మార్కెటింగ్ చేసే విధానాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఎంత కీలకమో వివరించారు. రైతులు బాగుపడాలంటే అందరం చేయి చేయి కలపాలని ఆయన కోరారు. అగ్రిగేటర్లు, వ్యాపారులు, బి.ఆర్.సి యజమానులు ముందు తరాలకు స్పూర్తినిచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని మరింత స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రకృతి వ్యవసాయ పారిశ్రామికవేత్తలు (బయ్యర్లు) పాల్గొని, తమకు కావాల్సిన ఉత్పత్తుల వివరాలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. యంత్రాల సరఫరాదారులు, లాజిస్టిక్స్ ప్రతినిధులు కూడా రైతులకు తమ సేవలపై అవగాహన కల్పించారు.
థీమాటిక్ లీడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన ఆహార ఉత్పత్తులను అగ్రిగేటర్లు మంచి ధరకు కొనుగోలు చేసి వాటికి విలువ జోడించి వ్యాపారవేత్తలు కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. బయో ఇన్‌పుట్ సెంటర్ల యజమానులు రైతులకు ఎల్లప్పుడూ ఇన్‌పుట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే దిగుబడి తగ్గుతుందనే అపోహలను పి.ఎం.డి.ఎస్ తొలగించిందని అన్నారు. చదువుకున్న యువకులు ముందుకు వచ్చి రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా విక్రయించి మంచి లాభాలు పొందాలని సూచించారు.
ముందుగా వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతులు వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్ప్పతులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రైతు సాధికార సంస్థ కార్యనిర్వహణ అధికారి రామారావు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సినీయర్ కన్సల్టెంట్ ప్రణవ్ భార్గవ్ , మార్కెటింగ్ థీమాటిక్ లీడ్ వి.సి. భీజేష్, రైతు నేస్తం ఫౌండేషన్ వెంకటేశ్వరులు, వివిధ జిల్లాల జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు రాజకుమారి, సుభాషిని, షణ్ముఖ, సయ్యద్ ఉస్సేన్ షా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News