-జిల్లా కలెక్టరును కలిసి మత్స్యకారుల సమస్యలపై ఎంపీ చర్చలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పులికాట్ సరస్సు అంతర్రాష్ట్ర జల వివాద సమస్య పరిష్కారం కోసం సంబంధిత గ్రామాల మత్స్యకారులు, వారి నాయకులతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జిల్లా కలెక్టరును కలిశారు. పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ మ్యాప్స్ ప్రకారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉండగా, ఈ ప్రాంతం అంతర్రాష్ట్ర సరిహద్దుకు సుమారు 3.34 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు సరిహద్దులు మార్చి చేపల వేట కొనసాగిస్తున్నారని కలెక్టరుకి వివరించారు. ఈ సమస్యపై కూలంకుషంగా చర్చలు జరిపి, మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టరుకు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం తిరువళ్ళూరు జిల్లా కలెక్టరుతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల సన్నాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కొంత సమయం పదుతుందని, ఆందోళన చెందవద్దని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఈ అంశంపై సోమవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టరుతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం మాట్లాడిన ఎంపీ గురుమూర్తి ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో మరోసారి లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మత్స్యకారులు స్నేహభావంతో వ్యవహరించి ఎలాంటి గొడవలకు దూరంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News